SONIA GANDHI CHINTAN SHIVIR: కాంగ్రెస్‌కు కొత్త ఉషోదయం రానుందని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఉద్ఘాటించారు. చింతన్ శిబిర్ ముగింపు సందర్భంగా ప్రసంగించిన సోనియా.. పార్టీ బలోపేతానికి దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. 'భారత్ జోడో' పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే ఈ యాత్ర.. గాంధీ జయంతి రోజున ప్రారంభం కానుందని వెల్లడించారు. జూన్ 15 నుంచి కాంగ్రెస్ రెండో విడత జన జాగారణ్ యాత్ర మొదలవుతుందని సోనియా తెలిపారు. నిరుద్యోగం ప్రధాన అస్త్రంగా జనజాగరణ్ యాత్ర సాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా యాత్రలు నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని పేర్కొన్నారు.
"ఒత్తిడిలో ఉన్న సామాజిక సామరస్య బంధాలను పటిష్ఠం చేసేందుకు, దాడికి గురవుతున్న రాజ్యాంగ పునాది విలువలను కాపాడేందుకు, కోట్లాది మంది ప్రజల రోజువారీ ఆందోళనలను ఎత్తిచూపేందుకు ఈ 'భారత్ జోడో' యాత్ర సాగుతుంది. జిల్లా స్థాయిలో జన్ జాగరణ్ అభియాన్ 2.0ను జూన్ 15 నుంచి ప్రారంభించాలి. ఆర్థిక సమస్యలను ముఖ్యంగా పెరుగుతున్న నిరుద్యోగం, జీవనోపాధిని నాశనం చేస్తున్న భరించలేని ధరల పెరుగుదలను ఎత్తిచూపడమే ప్రచారం చేయాలి."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
ఉదయపుర్‌లో వివిధ కమిటీలు చర్చించి, సూచించిన సంస్కరణల ప్రక్రియను మొదలుపెట్టేందుకు ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సోనియాగాంధీ ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించే సంస్కరణలు, నిర్మాణం, పార్టీ పదవులకు నియామకాలు, నియమాలు, కమ్యూనికేషన్‌లు, ప్రచారం, ఔట్‌రీచ్, ఆర్థిక, ఎన్నికల నిర్వహణతో సహా అన్ని అంశాలను టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తుందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో టాస్క్ఫోర్స్పై ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.
"రాజకీయ సమస్యలు, సవాళ్లపై చర్చించడానికి వర్కింగ్ కమిటీ నుంచి ఒక సలహా మండలి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సలహా మండలి క్రమం తప్పకుండా సమావేశమై రాజకీయ అంశాలపై పార్టీ ప్రెసిడెంట్కు తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. సీనియర్ నేతల అపారమైన అనుభవాన్ని పొందడంలో కూడా ఈ సలహామండలి సహాయకారిగా ఉంటుంది. సంస్థాగత మార్పులకు సంబంధించిన నివేదిక తక్షణమే అమల్లోకి రావాల్సి ఉంది. ఆ కమిటీ ఇచ్చిన వివరణాత్మక సిఫార్సులు స్వీకరించి త్వరితగతిన చర్యలు తీసుకుంటాం."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
చింతన్ శిబిర్ ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగిందని అన్నారు సోనియా. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో మమేకమై చర్చలు జరిపేందుకు చింతన్ శిబిర్ ఉపయోగపడిందని చెప్పారు. సంస్థాగత మార్పులకు సంబంధించిన సూచనలు తక్షణమే అమలులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. 'చింతన్ శిబిర్ మంచి ఫలితాల సాధన దిశగా సాగింది. నిర్మాణాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో సూచనలను అందించడానికి నేతలకు అవకాశం వచ్చింది. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించడానికి సమావేశాలు ఉపయోగపడ్డాయి. ఆరు కమిటీల చర్చల్లో హాజరై నేను కూడా పలు సూచనలు చేశాను. పలువురు చేసిన ప్రతిపాదనలను తెలుసుకోగలిగాను. మూడు రోజుల పాటు ఇంత మంది నేతలతో సమయం వెచ్చించడం.. నా కుటుంబంతో గడిపినట్లు అనిపించింది' అని సోనియా పేర్కొన్నారు.
అంతకుముందు, సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. నేతలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేయాలంటే దగ్గరి దారులు ఉండవని తెలిపారు. ఈ పోరాటంలో తుదిశ్వాస వరకు వెంట ఉంటానని నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: