కాంగ్రెస్ అసమ్మతి నేతలతో సోనియా గాంధీ సమావేశమయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో సీనియర్ నేతలు తమ అభిప్రాయాలను సోనియాకు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్కు బాధ్యతలు అప్పగించే విషయంపైనా సమావేశంలో చర్చించారు. పార్టీ ఇచ్చే ఏ బాధ్యతనైనా తీసుకునేందుకు రాహుల్ సిద్ధమని సీనియర్ నేతలు పేర్కొన్నారు.
పార్టీలో అసమ్మతి లేదని సీనియర్ నేత పవన్ బన్సల్ తెలిపారు. కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు అందరం ఐకమత్యంతో ముందుకుసాగుతామని పేర్కొన్నారు. పార్టీ పెండింగ్ అంశాలపై చింతన్ శిబిర్‌లో చర్చిస్తామని, త్వరలోనే ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. రాహుల్ అధ్యక్షుడు అయ్యేందుకు ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
కొత్త అధ్యక్షుడి ఎంపిక మొదలైంది..
పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైందని సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. ఇదే తరహాలో మరికొన్ని భేటీలు జరుగుతాయని తెలిపారు.