ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా స్పీడ్‌గా ఉన్నారు. కనీసం మాటలు కూడా సరిగ్గా పలకలేని చిన్నారులు సైతం సెల్ఫోన్లతో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. కొందరు పిల్లలు అయితే చేతికి మొబైల్ ఇవ్వకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా మారారు. ప్లేస్టోర్‌లో పలు గేమ్‌లను ఇన్స్టాల్ చేసి ఆడుకుంటూ.. ఫోన్లో ఉన్న అన్ని ఫీచర్లను వాడేస్తున్నారు. అలాంటి ఓ చురుకైన పిల్లాడు తన తండ్రి మొబైల్లో ఆన్లైన్ గేమ్ ఆడి ఏకంగా రూ.39 లక్షలు పోగొట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది ఈ ఘటన.
ఇదీ జరిగింది..
ఆగ్రాలోని తాజ్నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి మొబైల్‌ను తరూచూ వాడుతుండేవాడు. ఆన్లైన్ గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుని ఆడేవాడు. తాజాగా ఆ పిల్లాడు తన తండ్రి మొబైల్లో 'బ్యాటిల్ గ్రౌండ్' అనే ఆన్లైన్ పెయిడ్ గేమ్‌ను ఇన్స్టాల్ చేశాడు. ఆ తర్వాత డబ్బులు చెల్లించే ఆప్షన్‌ను ఆటోమోడ్లో పెట్టేశాడు. పిల్లాడు చాలా సార్లు గేమ్ ఆడాడు. ఆడిన ప్రతీసారి ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. అయితే కొన్ని రోజులకు పిల్లాడు తండ్రి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు చెక్ చేయడానికి వెళ్లగా... రూ.39 లక్షలు మాయమైనట్లు గమనించారు.
వెంటనే దీనిపై ఆగ్రా రేంజ్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సింగపుర్లోని క్రాఫ్టన్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్రాంత సైనికుడి ఫిర్యాదు మేరకు క్రాఫ్టన్ కంపెనీపై మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆకాశ్ సింగ్ తెలిపారు. ఈ సైబర్ క్రైమ్ కేసులో అన్ని రకాల ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి: బాలుడిని కాటేసిన విషసర్పం.. క్షణాల్లోనే ఆ పాము మృతి!
'ప్లాసీ'కి ముందే ఆర్కాట్లో బీజం.. భారతావనిలో ఆంగ్లేయుల రాజ్యం!