భుజంపై కావడి.. అందులో ఓవైపు అమ్మ, మరోవైపు నాన్న.. శక్తినంతా కూడదీసుకుంటూ భారంగా అడుగులు.. ఎండైనా, వానైనా ఆగకుండా సాగే పయనం.. ఇలా ఒకటి, రెండు కాదు.. ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు 'కలియుగ శ్రవణుడు' వికాస్ గహ్లోత్. జీవిత చరమాంకంలో కావడి యాత్ర చేయాలన్న తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చుతున్నాడు.
వికాస్ గహ్లోత్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ వాసి. వృద్ధాప్యంలో ఉన్న అతడి తల్లిదండ్రులు.. కావడి యాత్ర చేయాలని ఉందని చెప్పారు. కావడి యాత్ర అంటే అంత సులువైనదేమీ కాదు. శారీరకంగా శ్రమతో కూడుకున్నది. ఈ యాత్ర కోసం.. వేర్వేరు ప్రాంతాల్లోని శివ భక్తులు.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బిహార్‌లోని సుల్తాన్‌గంజ్ వంటి చోట్లకు వెళ్లి గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. అనంతరం అక్కడ గంగాజలం సేకరించి, బిందెల్లో నింపి, కావడిపై మోసుకుంటూ స్వస్థలాలకు చేరతారు. వారి సొంత ఊళ్లలోని శివాలయాల్లో ఆ గంగా జలాన్ని సమర్పిస్తారు.
అపారమైన ప్రేమ, ఉక్కు సంకల్పంతో..
కావడి యాత్ర ఇంత కష్టమైనా.. అమ్మానాన్నల కోర్కెను వికాస్ కాదనలేకపోయాడు. తానే అభినవ శ్రవణ కుమారుడి అవతారం ఎత్తాడు. ఇద్దరితో కలిసి గాజియాబాద్ నుంచి హరిద్వార్ వెళ్లి గంగా స్నానం ఆచరించాడు. పవిత్ర జలం సేకరించి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని గాజియాబాద్‌కు కావడి యాత్ర ప్రారంభించాడు. ఇందుకోసం లోహంతో ఓ బలమైన కావడి చేయించాడు. ఓవైపు అమ్మను, మరోవైపు నాన్నను కూర్చోబెట్టాడు. 20 లీటర్ల గంగా జలం నింపిన డబ్బాను నాన్న దగ్గరే పెట్టాడు. ఎండ, వానలో తమను భుజాలపై మోస్తూ కొడుకు పడుతున్న కష్టాన్ని చూడకుండా ఉండేందుకు అమ్మానాన్నల కళ్లకు గంతలు కట్టాడు వికాస్. అతడికి అండగా ఉండేందుకు ఇద్దరు స్నేహితులూ తోడయ్యారు.
జులై 17న హరిద్వార్ నుంచి తిరుగుపయనమైన.. ఈ అభినవ శ్రవణుడు.. ఉక్కు సంకల్పం, తల్లిదండ్రులపై ప్రేమతో నిరాటంకంగా ముందుకు కదులుతున్నాడు. శనివారం మేరఠ్ చేరుకున్న వికాస్‌ను స్థానిక జిల్లా పంచాయత్ అధ్యక్షుడు గౌరవ్ చౌదరి సన్మానించారు.
శ్రవణ కుమారుడి ప్రస్తావన రామాయణంలో ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భక్తికి అతడు ప్రతీక. శ్రవణుడి అమ్మానాన్నలు.. శంతను, జ్ఞానవతి. ఇద్దరూ అంధులు. వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరినీ దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలను తీసుకెళ్లాలని శ్రవణుడు భావిస్తాడు. ఆర్థిక స్తోమత లేక.. అమ్మానాన్నలను ఇలానే కావడిలో కూర్చోబెట్టి యాత్ర సాగిస్తాడు.