Son Killed Father For Insurance Money in Kodangal : చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రిని ఓ కిరాతక కుమారుడు అతి దారుణంగా హతమార్చాడు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుకు ఆశపడి పేగు బంధాన్ని కడతేర్చాడు. నేటి సమాజం.. మానవ సంబంధాలను ఎన్నడో మరిచి.. కేవలం మనీ బంధానికే విలువ ఇస్తుందనడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. తండ్రిని హతమార్చి అది ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మంగళవారం రోజున వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న బీక్య నాయక్ తండాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని కుమారుడే హత్య చేశాడు. కొడంగల్ నియోజకవర్గంలోని బీక్య నాయక్ తండాకు చెందిన చందిన రాఠోడ్ ధన్సింగ్కు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు జీవనోపాధి నిమిత్తం తాండూర్ వెళ్లి పనులు చేసుకుంటూ ఉండేవాడు. మిగిలిన ఇద్దరు కుమారులు రవి నాయక్, శ్రీనివాస్ నాయక్ ఇద్దరూ తండాలోనే నివాసం ఉంటూ తండ్రితో జీవనం సాగించేవారు.
తండ్రి బీమా డబ్బులపై ఎన్నో రోజులుగా కన్నేసిన చిన్న కొడుకు రవి వాటి కోసం కన్నతండ్రిని కడతేర్చేందుకు పక్కా పథకం రచించాడు. అందుకోసం.. మంగళవారం తెల్లవారుజామున తండ్రిని ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని.. ఇంటి నుంచి బయటకు బయలు దేరాడు. కొడంగల్ మండలం ఉడిమేశ్వరం గేటు దగ్గర ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి బండరాయితో తలపై గట్టిగా కొట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా 108కు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని నమ్మించి ధన్ సింగ్‌ను కొడంగల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లాడు. అయితే అప్పటికే తన తండ్రి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ విషయం తెలుసుకున్న రెండో కుమారుడు శ్రీనివాస్ నాయక్‌కు తండ్రి మృతిపై అనుమానం కలిగింది. వెంటనే కొడంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. బీమా డబ్బు కోసం తానే తండ్రిని చంపినట్లు రవి పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తన తండ్రి పేరు మీద ఓ ప్రైవేటు బీమా సంస్థలో రూ. 50లక్షలు ప్రమాద బీమాను చేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఆ బీమాకు తననే నామినీగా నమోదుచేసినట్లు తెలిపాడు. డబ్బులు అత్యవసరమై.. తండ్రిని అడిగితే లేవు అనే సమాధానం చెప్పడంతో.. ఈ రకమైన పథకం రచించానని పోలీసుల ముందు రవి అంగీకరించాడు. తాండూరులో ఉన్న అన్న వద్దకు వెళ్దామని చెప్పి నమ్మించి అదను చూసి హత్య చేసినట్లు అసలు సంగతి బయటపెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు రవి నాయక్‌ను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: