Somalia Ship Hijack India : హిందూ మహా సముద్రంలో మరో నౌక హైజాక్‌కు గురైంది. సోమాలియా తీరంలో ఈ ఘటన జరిగింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ వాణిజ్య నౌకలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది. హైజాక్ అయిన నౌక జాడను గుర్తించేందుకు యుద్ధనౌకను మోహరించింది.
MV లీలా నార్‌ఫోక్ నౌక గురువారం హైజాక్‌కు గురైనట్లు బ్రిటిష్ మిలిటరీకి చెందిన UK మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) గుర్తించింది. ఈ సమాచారాన్ని భారత నౌకాదళానికి తెలియజేసింది. వెంటనే హిందూ మహాసముద్రంలో పెట్రోలింగ్ చేపట్టినట్లు నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. తీరప్రాంత రక్షణ కోసం మోహరించిన INS చెన్నై యుద్ధనౌకను సహాయార్థం పంపినట్లు వివరించారు. హైజాక్ గురైన నౌకలోని సిబ్బంది క్షేమ సమాచారంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. నౌకలోని సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. మిగతా ఏజెన్సీలతో కలిసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. హిందూ మహాసముద్రంలో వాణిజ్య నౌకల రక్షణకు భారత నౌకాదళం కట్టుబడి ఉన్నట్లు నేవీ ప్రతినిధి స్పష్టం చేశారు.
భారత నేవీ గట్టి నిఘా
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులు నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత నావికా దళం అరేబియా సముద్రంలో నిఘా పెంచింది. ఇటీవలే అరేబియా సముద్రంలో ఓ నౌక హైజాక్‌కు గురికాగా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. మాల్టాకు చెందిన వాణిజ్య నౌక సోమాలియాకు వెళ్తుండగా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఆ నౌక నుంచి సమాచారం అందగానే భారత నేవీ అప్రమత్తమై యుద్ధ విమానం, యుద్ధ నౌకను రంగంలోకి దించింది. వాణిజ్య నౌకను అడ్డగించింది.
అరేబియా సముద్రంలో MV కెమ్ ప్లూటో అనే నౌక డ్రోన్ దాడికి గురైన సమయంలో కోస్టుగార్డు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. లైబీరియా జెండా ఉన్న ప్లూటో నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు వస్తున్న సమయంలో పోర్బందర్కు 217 నాటికల్ మైళ్ల దూరంలో దాడికి గురైంది. ఐసీజీఎస్ విక్రమ్‌ను రంగంలోకి దించిన కోస్టుగార్డు- వాణిజ్య నౌకను సురక్షితంగా ముంబయి తీరానికి చేర్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
క్రిమియాలో ఉక్రెయిన్ దూకుడు- రష్యా సైనిక నౌకపై క్షిపణి దాడి- ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం!