sologamy gujrat: ఓ అమ్మాయి, ఓ అబ్బాయి పెళ్లిచేసుకోవటం సర్వసాధారణం. అమ్మాయిని అమ్మాయి, అబ్బాయిని, అబ్బాయి వివాహం చేసుకోవటం కూడా ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడూ చూస్తుంటాం. కానీ ఓ అమ్మాయి తనను తానే పెళ్లిచేసుకోవటం ఎప్పుడైనా చూశారా? పోనీ కనీసం విన్నారా? దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ వింతపెళ్లిగాథ వివరాలు ఈ కథనంలో చూద్దాం.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు. వయస్సు 24 ఏళ్లు. క్షమాబిందు వివాహం ఈ నెల 11న జరగనుంది. పెళ్లి వేడుకకు రావాల్సిందిగా ఇప్పటికే స్నేహితులు, సహోద్యోగులకు ఆహ్వానాలు పంపారు. ఇందులో వింతేముందీ అనుకుంటున్నారా..? జరుగుతున్నది సాధారణ పెళ్లి కాదు. సోలోగమీ. ఇప్పటికీ అర్థం కాలేదుకదా? సోలోగమీ అంటే స్వీయ పరిణయమని అర్థం. మీరు విన్నది నిజమే. క్షమాబిందు తనను తాను పెళ్లి చేసుకోబోతోంది. క్షమా బిందు వివాహం సాంప్రదాయ పద్ధతిలో జరగనుంది. వరుడు, ఊరేగింపు తప్ప మిగతా పెళ్లి తంతులన్నీ సంప్రదాయబద్దంగా జరగనున్నాయి. అంతే కాదు పెళ్లి తర్వాత క్షమాబిందు హనీమూన్‌కు గోవా వెళ్లనుంది.
సోషియాలజీ చదివిన బిందు ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో పొరుగుసేవల ఉద్యోగిగా పనిచేస్తోంది. యుక్త వయస్సులోకి వచ్చినప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనే కోరిక తనకు లేదన్న బిందు పెళ్లికూతురిగా తయారు కావాలనే కోరిక మాత్రం ఉండేదని చెబుతోంది. అందుకే తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అందరూ ప్రేమించిన వారినే పెళ్లిచేసుకోవాలని కోరుకుంటారన్న బిందు తనను తాను ప్రేమిస్తున్నందునే వివాహానికి సిద్ధమైనట్లు వివరించింది. తన తల్లిదండ్రులు సైతం ఈ స్వీయ పరిణయానికి అంగీకరించినట్లు తెలిపింది.
"ఈ ఆలోచన చిన్నప్పటి నుంచే నా మనసులో ఉంది. కానీ, అది సాధ్యమవుతుందా అనే విషయంపై ఎప్పుడూ ఆలోచించలేదు. నన్ను నేను పెళ్లి చేసుకోవచ్చా అని గూగుల్లో సర్చ్ చేశాను. అప్పుడు 'సోలోగమీ- తనను తానే పెళ్లి చేసుకోవడం' గురించి తెలుసింది. అది తెలుసుకున్నాక నన్ను నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ఆలోచించా. చిన్నప్పటి నుంచే నేను స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతాను కాబట్టి.. నా తల్లిదండ్రులను ఒప్పించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. సమాజం ఏం అనుకున్నా నాకు అవసరం లేదని వివరించాను. నా సంతేషమే వారి సంతోషం అని చెప్పారు."
- క్షమా బిందు
క్షమా బిందు వివాహం కోసం 15 మంది స్నేహితులు, సహోద్యోగులకు... ఆహ్వానాలను అందించారు. జూన్ 9న మెహందీ వేడుకతో పెళ్లి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. గోత్రిలోని ఒక ఆలయంలో జూన్ 11న ఈ స్వీయ పరిణయం జరగనుంది. పెళ్లి కోసం లెహెంగా, కుర్తా, దోతీ సహా ఆభరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశామని చెప్పింది క్షమా బిందు. తన ఉద్యోగానికి సెలవు పెట్టి గోవా వెళ్లాలనుకుంటున్నానని.. కొత్తగా పెళ్లి అయిన వారు వెళ్లిన విధంగానే చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది. 11వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది.
ఇదీ చూడండి: స్మార్ట్ సిటీలో యువకులకు పెళ్లి కష్టాలు.. నీళ్లే కారణం!
సముద్రాన్ని ఈది బంగ్లాదేశ్ నుంచి భారత్కు.. ప్రియుడి కోసం యువతి సాహసం!