కన్నతండ్రిపై ఓ సైనికుడు కర్కశంగా ప్రవర్తించాడు. కనికరం లేకుండా తండ్రి ప్రైవేటు శరీర భాగాలను కోసేశాడు. చేతివేళ్లను సైతం నరికేశాడు. తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ.. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధామ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీనగర్‌లో ఈ ఘటన జరిగింది. కచ్నాల్ ఘాజీ కుమాన్ కాలనీకి చెందిన వ్యక్తిపై ఈ దాడి జరిగింది. కన్న కొడుకే ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితులను.. బాధితుడి కొడుకు అర్పిత్, కాశీపుర్కు చెందిన రోహిత్ వర్మ, రాహుల్ సైనీగా పోలీసులు గుర్తించారు. 2022 డిసెంబర్ 26న సాయత్రం ఈ ఘటన జరిగింది.
"నా కొడుకు తన ముగ్గురు స్నేహితులతో కలిసి నాపై దాడి చేశాడు. చెక్కలు కోసే యంత్రంతో నా ప్రైవేటు పార్ట్‌తో పాటు ఎడమ చేతి వేళ్లను నరికేశాడు. అందులో ఒక్క వ్యక్తి మాత్రమే నాకు తెలియదు. మిగతా వారు నాకు తెలిసినవారే. నిందితుల్లో ఇద్దరు నా నోరు మూసి, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మూడో వ్యక్తి కదలకుండా నా కాళ్లు పట్టుకున్నాడు. అనంతరం నాపై దాడి చేసి ముగ్గురు పారిపోయారు. వెంటనే నేను సృహా కోల్పోయాను" అని బాధితుడు తెలిపాడు.
"ఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ.. బాధితుడు మాకు ఆసల్యంగా ఫిర్యాదు చేశాడు. నిందితుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. వీరికి కుటుంబంలో కొన్ని గొడవలు ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న అర్పిత్.. తండ్రిపై క్రూరంగా దాడి చేశాడు. వైద్యుల నివేదిక ఆధారంగా తరువాతి చర్యలు తీసుకుంటాం" అని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
సిగరెట్ కోసం వచ్చి యువకుడిపై కత్తితో దాడి..
అప్పు అడిగినందుకు కిరాణ షాపు యజమాని కొడుకుపై.. ఓ వ్యక్తి దాడి చేశాడు. కత్తితో యువకుడి కన్నుపై బలంగా పొడిచాడు. దీంతో అతడి కన్ను పూర్తిగా బయటకు వచ్చింది. బిహార్‌లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. వెంటనే బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పరిస్థితి తీవ్రం కావడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం సాయత్రం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహనౌర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కిరాణ షాపు యజమాని అయిన అనిల్ కుమార్ కొడుకు జితేంద్ర కుమార్‌పై ఈ దాడి జరిగింది. అదే గ్రామానికి చెందిన మురారి అనే వ్యక్తి జితేంద్ర కుమార్‌పై దాడి చేశాడు. మొదట షాపు వద్దకు వచ్చిన మురారి.. జితేంద్ర కుమార్‌ను ఒక సిగరెట్ అప్పుగా అడిగాడు. పాత అప్పు ఇచ్చేంత వరకు కొత్తగా ఏమీ ఇవ్వనని జితేంద్ర.. మురారితో చెప్పాడు. ఇదే విషయంలో వారిద్దరికీ గొడవ జరిగింది. దీంతో షాపులోనే ఉన్న కత్తితో జితేంద్రపై మురారి దాడి చేశాడు. ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా మురారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలికపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారం..
6 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు.. ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఏడ్చుకుంటూ ఇంటికెళ్లింది. జరిగినదంతా తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, ముంబయిలోని మాన్కర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
వృద్ధురాలిని బెదిరించి రూ.12 లక్షలు చోరీ..
ఇంట్లో ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి రూ.12 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగులు. స్వీట్స్ ఇచ్చేందుకు వచ్చామని వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అనంతరం ఆమె గొంతును నొక్కి పట్టి, రివాల్వర్‌తో బెదిరించి నగలు, డబ్బులు ఎత్తుకెళ్లారు. మహారాష్ట్ర, ముంబయిలోని దబార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఘటనపై పోలీసులను ఆశ్రయించింది వృద్ధురాలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్యను గొంతు కోసి చంపిన భర్త..
అనుమానంతో భార్యను గొంతు కోసి చంపాడు ఓ భర్త. రోడ్డుపైనే ఆమెపై పదునైన కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అదే కత్తితో తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి 40 ఏళ్లు, నిందితుడికి 45 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. వీరిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నట్లు వెల్లడించారు.