స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఆ గ్రామ సర్పంచే టీచర్ అవతారం ఎత్తారు. ఓ వైపు గ్రామ పరిపాలన బాధ్యతలు చూసుకుంటూనే.. పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. మహారాష్ట్ర సోలాపుర్‌లోని సాల్ఘర్ ఖుర్ద్ గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. ఇక్కడి జిల్లా పరిషద్ పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగో తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఉన్నప్పటికీ.. ఈ స్కూల్లో కొన్నేళ్ల నుంచి ఒకే టీచర్ ఉంటున్నారు. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నా.. ఎలాంటి ఫలితం లేదు. విద్యాశాఖకు మొరపెట్టుకున్నా.. స్కూల్‌కు కొత్తగా టీచర్లు ఎవరూ రాలేదు.
ఉపాధ్యాయులు లేని కారణంగా విద్యార్థులు నష్టపోకూడదని భావించిన గ్రామ సర్పంచ్ ఆర్తి అజయ్ కాంబ్లే.. స్వయంగా పాఠాలు బోధించేందుకు ముందుకొచ్చారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తూనే.. మరోవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ప్రస్తుతం స్కూల్లో టీచర్‌గా ఉన్న అప్ప సవిసర్జేతో కలిసి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు ఆర్తి కాంబ్లే. ఒకటో తరగతి విద్యార్థుల బాధ్యతలను ఆర్తి చూసుకుంటున్నారు. మరో వలంటీర్ సైతం వీరికి సహకరిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే ప్రంజలి మహేశ్ మస్కే అనే వలంటీర్ సైతం స్కూల్లో పాఠాలు చెబుతున్నారు.
చిన్నారుల భవితపై ఆందోళన
2022 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచారు ఆర్తి. ఆమె డిగ్రీ వరకు చదువుకున్నారు. విద్య ప్రాధాన్యం తెలిసిన ఆర్తి.. సర్పంచ్‌గా బాధ్యలు చేపట్టిన తర్వాత పిల్లల చదువులపై దృష్టి పెట్టారు. గ్రామంలోని జిల్లా పరిషద్ పాఠశాలను తరచూ తనిఖీ చేసేవారు. గ్రామంలోని విద్యార్థులకు.. చూసి చదవడం, రాయడం కూడా రావట్లేదని గ్రహించారు. వారికి నాణ్యమైన విద్య అందడం లేదని భావించిన ఆర్తి.. ఇలాగే కొనసాగితే చిన్నారుల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని ఆందోళన చెందేవారు.
దీంతో స్కూల్‌కు టీచర్లను నియమించాలని కోరుతూ విద్యా శాఖ అధికారులకు లేఖలు రాశారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. విద్యా శాఖ నుంచి స్పందన లేదు. కొత్త టీచర్లు రాలేదు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని గ్రహించిన ఆర్తి.. జులై 10 నుంచి స్కూల్లో పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ఒకటో తరగతి, రెండో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నారు. ఓ వైపు ఇంటి పనులు, మరోవైపు గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఆర్తిని పలువురు అభినందిస్తున్నారు.