బంగాల్ డార్జీలింగ్లోని ఘోష్పుకొర్ ప్రాంతంలో అధికారులు భారీ ఎత్తున సర్పాల విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు జరిపిన అటవీ అధికారులు శనివారం రాత్రి రెండున్నర కేజీల విషాన్ని గుర్తించారు. ఈ విషాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని మహమ్మద్ సరాఫత్‌గా గుర్తించినట్లు అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర దినాజ్‌పుర్ జిల్లాలోని ఖురాయి ప్రాంతంలో ఇతడు నివసిస్తున్నట్లు వెల్లడించాయి. 'సీసాలో నింపిన పాము విషాన్ని ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి తీసుకెళ్తున్నాడు. ఘోష్పుకొర్ ప్రాంతంలో జాతీయ రహదారిపై మేం నిఘా పెట్టాం. ఈ దారిలో నిందితుడు వెళ్తుండగా పట్టుకున్నాం. అనంతరం అరెస్టు చేశాం. అతడి వద్ద నుంచి భారీ ఎత్తున పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నాం' అని అటవీ శాఖ వర్గాలు వివరించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాము విషం రూ.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
'నిందితుడిని విచారించగా.. పాము విషం ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చిందని చెప్పాడు. ఈ విషాన్ని అతడు నేపాల్‌కు తీసుకెళ్తున్నట్లు వివరించాడు. నేపాల్ నుంచి చైనాకు తీసుకెళ్లాలన్నది అసలు ప్లాన్. అయితే, సరైన సమయంలో సమాచారం అందడం వల్ల స్మగ్లింగ్ గుట్టురట్టైంది. దీని వెనక అంతర్జాతీయ ముఠాల హస్తం ఏదైనా ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టాం' అని అధికారులు వెల్లడించారు.