పాము కాటేసిందనగానే భయపడిపోయి హడావుడి చేస్తాం. ప్రాథమిక చికిత్స అందించాలని తెలిసినా ఆ భయంలో ఏం చేయలేకపోతాం. కానీ ఓ యువతి మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించి.. తన తల్లి ప్రాణాలను కాపాడుకుంది. విషపూరిత పాము కరిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లికి పునర్జన్మను ఇచ్చింది. ఆ విషాన్ని తన నోటితో తీసి రక్షించింది. ఈ ఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూర్‌లో జరిగింది. ఈ ప్రమాదం వారం క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది
పుత్తూరులోని కేయూరు గ్రామానికి చెందిన మమత రాయ్, సతీశ్ రాయ్ భార్యభర్తలు. వీరికి శ్రామ్య రాయ్ అనే కుమార్తె ఉంది. ఈమె పుత్తూరులోని వివేకానంద కళశాలలో బీసీఏ చదువుతోంది. కేయూరు గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలైన మమత రాయ్.. రోజూలాగే చెట్లకు నీరు పట్టేందుకు పెరట్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెను ఓ విషపూరితమైన పాము కాటు వేసింది. దీంతో భయపడిన ఆమె హుటాహుటిన ఇంటిలోకి పరిగెత్తింది. తల్లి పరిస్థితిని చూసిన కూతురు సమయస్ఫూర్తితో వ్యవహరించింది. విషం శరీరమంతా వ్యాపించకుండా.. తన నోటితో బయటకు తీసింది. అనంతరం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి.. పుత్తూరులోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందని.. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. కాలి నుంచే విషం తీయడం వల్ల పూర్తి శరీరంలోకి వ్యాపించలేదని వైద్యులు తెలిపారు. తన ప్రాణాలకు తెగించి మరీ తల్లిని కాపాడిన శ్రామ్యను వైద్యులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.
కాటేసిన పాముపై రివెంజ్.. సర్పాన్ని కరిచిన బాలుడు.. పిల్లాడు సేఫ్ పాము మృతి
అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కొంత కాలం క్రితం ఓ వింత ఘటన జరిగింది. తనను పాము కాటు వేసిందన్న కోపంతో ఆ పిల్లాడు తిరిగి పామును కరిచాడు. ఈ ఘటనలో పాము చనిపోగా.. ఆ అబ్బాయి మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు. జష్‌పుర్ జిల్లా గార్డెన్ డెవలప్‌మెంట్ బ్లాక్‌కు చెందిన పండారపథ్‌లోని కోర్వా తెగకు చెందిన దీపక్ రామ్ అనే 12 ఏళ్ల బాలుడు పాము కాటుకు గురయ్యాడు. ఆ చిన్నారి ఆడుకుంటూ తన సోదరి ఇంటికి వెళ్తుండగా.. చేతిపై పాము కాటేసింది. దీంతో ఆగ్రహించిన దీపక్.. పామును పట్టుకుని రెండు చోట్ల కరిచాడు. ఈ ఘటనలో పాము అక్కడికక్కడే మరణించింది. ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో చెప్పగా.. దీపక్‌ను ఆస్పత్రికు తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ ప్రాంతంలో మనుషుల్ని పాము కరిస్తే వారు కూడా తిరిగి పామును కరవాలని.. అలా చేస్తే ఏ ప్రమాదం ఉండదని వారు నమ్ముతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి : పాత నోట్లను ఇప్పటికీ మార్చుకోవచ్చా?.. సుప్రీంకోర్టు క్లారిటీ!
మంచానికే పరిమితమైన తల్లి.. తాజ్ మహల్ చూడాలని కోరిక.. కొడుకు ఏం చేశాడంటే?