కర్ణాటకలోని మైసూర్ దసరా ఉత్సవాలు(mysore dasara festival)కరోనా జాగ్రత్తల మధ్య అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మైసూర్ రాజవంశీయుల ఇష్టదైవం చాముండేశ్వరి ఆలయంలో 411వ దసరా వేడుకలను ఆరంభించారు మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం క్రిష్ణ. ఆయనతో పాటు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మంత్రి ఎస్టీ సోమశేఖర్ హాజరయ్యారు.
చాముండి కొండపై ఉన్న మైసూర్ రాజవంశీయుల కులదైవం చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నేతలు. అక్టోబర్ 15న విజయదశమి రోజున ఈ వేడుకలు ముగుస్తాయి. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా చాలా తక్కువ మంది భక్తులతో నిర్వహించాలని నిర్ణయించారు.
పూజల అనంతరం మాట్లాడిన ఎస్ఎం క్రిష్ణ మోదీపై ప్రశంసలు కురిపించారు.
" దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. నా రాజకీయ జీవితంలో అలాంటి నేతను చూడలేదు. ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని చాముండేశ్వరి అమ్మవారిని కోరుకున్నా. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని దసరా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం బసవరాజ్ బొమ్మై నిర్ణయం తీసుకున్నారు. విజయనగర రాజుల కాలంలో వారి సామర్థ్యాన్ని చూపేందుకు ఈ ఉత్సవాలు చేసేవారు. అప్పటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. "
- ఎస్ఎం క్రిష్ణ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
ముఖ్యమైన పూజలు..
- అక్టోబర్ 12న సరస్వతీ పూజ
- అక్టోబర్ 13న దుర్గాష్టమి
- అక్టోబర్ 14న ఆయుధ పూజ
- అక్టోబర్ 15న జంబూ సవారీ(ఏనుగుల ఊరేగింపు)
ఇదీ చూడండి: కరోనా ఆంక్షల నడుమ.. మైసూర్లో 'దసరా' ఉత్సవాలు