Skill Development Case Chandrababu Bail Petition: నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ (CID) తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ప్రకటించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరగగా.. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా (Sidharth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) మధ్యంతర బెయిలు పిటిషన్‌తో పాటు ప్రధాన బెయిలు పిటిషన్‌పై వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు గతంలో మధ్యంతర బెయిలు పిటిషన్‌పైనే వాదనలు వినిపించారని.. ప్రస్తుతం ప్రధాన బెయిలు పిటిషన్‌పై వాదనలు వినిపించాల్సి ఉందన్నారు.
అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు
దీనికి పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ.. తాము ప్రధాన బెయిలు పిటిషన్‌పై గతంలోనే వాదనలు వినిపించామన్నారు. కోర్టు డాకెట్ ఆర్డర్‌ను పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు. ఏఏజీ వాదనలు కొనసాగిస్తూ.. అదనపు వివరాలతో కౌంటరు వేశామన్నారు. రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదుచేశామని పిటిషనర్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. అక్రమాల గురించి ఓ విజిల్ బ్లోయర్ 2018లో సమాచారం ఇచ్చారన్న ఆయన.. 2018 జూన్‌లో ఏసీబీ విచారణ ప్రారంభించిందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదు చేసిందన్న వాదన సరికాదని పొన్నవోలు వాదించారు. ప్రాజెక్టు కోసం సీమెన్స్ సంస్థ తన వాటాగా 90 శాతం నిధులను ఖర్చు చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా కింద 330 కోట్లు విడుదల చేసిందన్నారు. షెల్ కంపెనీల ద్వారా 214 కోట్లు మళ్లించినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలిందన్నారు.
ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ - తీవ్ర ఉత్కంఠ
నిధుల విడుదలపై ఆర్థిక శాఖ అప్పటి కార్యదర్శి లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదన్నారు. అందుకు ఆధారంగా నోట్ ఫైళ్లు ఉన్నాయన్నారు. పిటిషనర్ ప్రోద్బలంతో సొమ్ము విడుదల చేశారన్న ఏఏజీ పొన్నవోలు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ప్రాజెక్టు వ్యయాన్ని మదింపు చేసిందనే కారణాన్ని చూపుతూ అక్రమాలు జరగలేదని చెప్పేందుకు పిటిషనర్ యత్నిస్తున్నారని అన్నారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చారన్న వాదనలో వాస్తవం లేదని పేర్కొన్నారు. పూర్తి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. చంద్రబాబు కంటి శస్త్ర చికిత్స, వైద్య పరీక్షల వివరాలను ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేశారు.
చంద్రబాబు కంటికి ఆపరేషన్ పూర్తి - క్యాటరాక్ట్ చికిత్స చేసిన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్య నిపుణులు