తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్. వచ్చే ఎన్నికలకు ముందు తన నాయకత్వంలో మూడో కూటమి ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఎంఎన్ఎం 4వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కమల్.
"రాష్ట్రంలో మూడో కూటమికి అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నా. పరిస్థితులు అందుకు అనుకూలంగా మారుతున్నాయి. అతి త్వరలోనే నా నాయకత్వంలోనే ఇది జరగవచ్చు."
- కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యమ్ అధినేత
ఇదీ చదవండి: ఎన్నికలకు ముందు రజనీని కలిసిన కమల్‌హాసన్
మరోవైపు, ద్రవిడ మున్నేట్ర కళగమ్(డీఎంకే) ఒప్పుకుంటే తాము కూటమికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు కమల్. డీఎంకే రహస్య ప్రతినిధి తమను సంప్రదించారని చెప్పిన ఆయన.. పార్టీ అధిష్ఠానం నుంచి నేరుగా ఆహ్వానం అందితేనే పొత్తును అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
అధికార అన్నాడీఎంకే-భాజపా, డీఎంకే-కాంగ్రెస్ నేతృత్వలోని కూటములు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాష్ట్రంలో జరగబోయే తొలి అసెంబ్లీ ఎన్నికలకు.. ఎంఎన్ఎం సిద్ధమవుతోంది. పార్టీ టిక్కెట్ల కోసం అభ్యర్థులకు దరఖాస్తులు అందిస్తోంది.
ఇదీ చదవండి: ఎల్డీఎఫ్ వ్యూహంతో తమిళనాట కమల్ పోరు