Sisters With Hearing Impairment: భారత్‌లో అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటి.. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్). ఎంతో కష్టపడితే కానీ ఉత్తీర్ణులవటం కష్టం. అలాంటిది ఇద్దరు బధిర సోదరీమణులు.. అందులో ర్యాంకు సంపాదించి నిజంగానే 'మణులు' అనిపించుకున్నారు. వారే కేరళకు చెందిన పార్వతీ ఎస్, లక్ష్మి ఎస్. ఆ రాష్ట్రం నుంచి ఐసీఎస్ ఉత్తీర్ణత సాధించింది కూడా వీరిద్దరే. అఖిల భారత స్థాయిలో పార్వతి 74వ ర్యాంకు, లక్ష్మి 75వ ర్యాంకుతో తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
కలను సాకారం చేసుకోవడంలో తమ లోపాన్ని అడ్డురానివ్వలేదు ఈ అక్కాచెల్లెల్లు. అయితే.. అదేమంత సులువు కాదు. వినికిడి లోపం కారణంగా అందరిలా వీరు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేరు. అయినా పట్టువిడవలేదు. నిరంతర కఠిన పరిశ్రమ, నిబద్ధతతో చదివారు. చెవులు దద్దరిల్లే విజయఢంకా మోగించారు.
తల్లే.. అన్నీ తానై: వీరి తల్లి సీత.. ప్రజాపనుల విభాగంలో జూనియర్ సూపర్ఇంటెండెంట్గా పనిచేస్తున్నారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. అయితే ఆ ప్రభావం చిన్నారులపై పడనివ్వలేదు సీత. వారికి ఉన్నత విద్యను అందించేందుకు శాయశక్తుల కష్టపడ్డారు. ఆమె గర్వపడే విజయాన్ని అందించారు.. పార్వతి, లక్ష్మి!
ఆ ఉద్యోగాలను కాదని: వినికిడి లోపం కారణంగా పెదాల కదలికలను బట్టి ఎదుటివారు మాట్లాడేదాన్ని వీరు అర్ధం చేసుకుంటారు. తిరువనంతరపురం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశపరీక్షలో పాసై అడ్మిషన్ సంపాదించారు పార్వతి, లక్ష్మి. ఆ తర్వాత పార్వతికి కేరళ ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. లక్ష్మి కూడా స్థానిక యంత్రాంగ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా తాత్కాలిక ఉద్యోగం పొందింది.
ఈ అక్కాచెల్లెల్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలూ వచ్చాయి. అయితే వాటిని తిరస్కరించి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. 2019 నుంచి పరీక్షలు రాయడం మొదలుపెట్టారు.
ఇదీ చూడండి: బధిర బాలుడైనా... బహు కళాకోవిదుడు