కఠోర సాధన, నిరంతర శ్రమ వారిని అందరికన్నా భిన్నంగా తయారుచేశాయి. ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. వారే మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా బుధేలాకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు. ఆ పాఠశాలలో చదువుతున్న 100 మంది విద్యార్థులు.. రెండు చేతులతో వేర్వేరు భాషలు అత్యంత వేగంగా రాయగల సమర్థులు. సాధారణ విద్యార్థులు గంటల్లో చేసే పనిని.. వీరు నిమిషాల్లోనే పూర్తి చేస్తారు. హిందీ, ఆంగ్లం, ఉర్దూ, స్పానిష్, సంస్కృతం ఇలా అనేక భాషలు అనర్గళంగా మాట్లాడతారు. ఈ ప్రతిభకు వీరు 'హ్యారీపోటర్ మ్యాజిక్' అని పేరు పెట్టారు. ఇప్పటివరకు ఈ విద్యార్థులు అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు.
విద్యార్థులు ఈ ఘనత సాధించడం వెనుక ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయనే వీరాంగద్ శర్మ. ఆయనకు వచ్చిన ఐడియాతో 1999 జులై 8న ఓ విద్యాలయాన్ని స్థాపించారు. అయితే ఈ విషయంపై ఆయనను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను ఓ రోజు జబల్పుర్ రైల్వే స్టేషన్లో ఓ పుస్తకం చదివితే.. భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెండు చేతులతో రాసేవారనే విషయం తెలిసిందన్నారు. అప్పటి నుంచి రెండు చేతులతో ఎలా రాస్తారనే విషయం గురించి చాలా ఆలోచించానని చెప్పారు. ఆ క్రమంలోనే పూర్వం నలంద విశ్వవిద్యాలయం విద్యార్థులు రోజుకు 32 వేల పదాలు రాసేవాళ్లనే విషయం తెలుసుకున్నానని వివరించారు. అయితే మొదట ఆ విషయాన్ని తాను విశ్వసించలేదని.. కానీ తర్వాత చాలా పుస్తకాల్లో చదివి దాని గురించి పరిశోధన చేసి తెలుసుకున్నానన్నారు. ఈ ఒక్క ఐడియాతో ఆర్మీ ఉద్యోగం వదిలి.. పాఠశాలను స్థాపించినట్లు తెలిపారు.
ఇలా రెండు చేతులతో రాయడాన్ని మొదట తాను ప్రయత్నించి చూశానని.. కానీ తాను సఫలం కాలేకపోయినట్లు వీరాంగద్ శర్మ చెప్పుకొచ్చారు. అనంతరం విద్యార్థులపై ఈ ఐడియా ప్రయోగించానని చెప్పారు. తనను విస్మయానికి గురిచేస్తూ.. పిల్లలు ఈ విద్యలో అద్భుతంగా రాణించారని వివరించారు. ప్రస్తుతం ఈ విద్యార్థులు 11 గంటల్లో 24 వేల పదాలు రాయగలరని వెల్లడించారు. ఓ పోటీలో ఈ వేగాన్ని విద్యార్థులు అందుకున్నారని వీరాంగద్ శర్మ తెలిపారు. ఇలా పిల్లలకు చదువు చెప్పుకుంటూ తానూ చదువుకుని ఎల్ఎల్బీ పూర్తి చేశానని పేర్కొన్నారు.
ఇలా చేయడం ఒక ఆధ్యాత్మిక సాధన లాంటిదని, అది కేవలం ధ్యానం, యోగా, సంకల్పం ద్వారానే సిద్ధిస్తుందని వీరాంగద్ అన్నారు. అందుకోసం విద్యార్థులకు ప్రతి రోజు యోగా, ధ్యానం గురించి శిక్షణ ఇస్తామని తెలిపారు. రెండు చేతులతో రాయడం.. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుందని, మొదడును చురుకుగా ఉంచుతుందని.. తద్వారా సమయం ఆదా అవుతుందని చెప్పారు. 1 నుంచి 100 వరకు ఉర్దూ అంకెలను.. ఈ విద్యార్థులు 45 సెకన్లలో రాస్తారని పేర్కొన్నారు. రోమన్, దేవనాగరి అంకెలు రాయడం ఒక నిమిషంలో పూర్తి చేస్తారని.. రెండు భాషలకు చెందిన దాదాపు 250 పదాలను ఒకే ఒక్క నిమిషంలో అనువదిస్తారన్నారు. ఎక్కాలు రాసేటప్పుడు ఒక చేయి ఒక ఎక్కం రాస్తే.. రెండో చేయి రెండో ఎక్కం రాస్తుందని చెప్పుకొచ్చారు.
మొదట మేము పాఠశాలకు వచ్చినప్పుడు కుడి చేతితో రాసేవాళ్లం. తర్వాత మా టీచర్ ఎడమ చేతితో రాయడం నేర్పించారు. అప్పటి నుంచి రెండు చేతులతో రాస్తున్నాము. నేను హిందీ, ఆంగ్లం, ఉర్దూ, రోమన్, సంస్కృతం భాషలు మాట్లాడగలను.
-మీరా శర్మ, విద్యార్థి
ఈ విద్యార్థులు రెండు చేతులతో ఎలా రాయగలుగుతున్నారనే ప్రశ్నకు.. సింగ్రౌలీ జిల్లా ఆస్పత్రికి చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆశిశ్ పాండే సమాధానం ఇచ్చారు. మెదడులో రెండు భాగాలుంటాయని.. ఎడవైపు మెదడు కుడివైపును నియంత్రిస్తుందని.. అలాగే కుడి వైపు మెదడు ఎడమ వైపును నియంత్రిస్తుందని చెప్పారు. రెండు భాగాలు కలిసి పని చేసేలా వారి మెదడు నిర్మాణం జరిగిందని.. దీంతో ఇప్పుడు రెండు చేతులతో పనులు చేయగలరని అన్నారు. ఇలా రెండు చేతులతో పనులు చేసే వాళ్లు కేవలం 1 శాతం మందే ఉంటారని.. వీరిని 'క్రాస్ వైస్' అని అంటారని చెప్పారు.
ఇవీ చదవండి : తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం
'హెలికాప్టర్ వల్లే నా గేదె చనిపోయింది'.. పైలట్‌పై వృద్ధుడి ఫిర్యాదు