SI PRELIMINARY RESULTS : ఆంధ్రప్రదేశ్‌లో 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రాథమిక పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ మనీష్ కుమార్ సిన్హా విడుదల చేశారు. ఎస్సై పరీక్షకు లక్షా 51వేల 2వందల 88 మంది అభ్యర్థులు హాజరవ్వగా.. 57వేల 9వందల 23 మంది అర్హత సాధించారు.
1,553 అభ్యంతరాలు స్వీకరించినట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. వచ్చే నెల(మార్చి) 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రెండు పరీక్ష పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఓసీ 40, బీసీ 35, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30 శాతం వస్తే అర్హత సాధించనున్న విషయం తెలిసిందే.
411 పోలీసు ఉద్యోగాల కోసం ఈ నెల 19న పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 211 కేంద్రాల్లో పరీక్ష చేపట్టారు. ఈ పరీక్షకు లక్షా 51వేల 2వందల 88 మంది హాజరు కాగా.. నేడు విడుదల చేసిన ఫలితాల్లో 57వేల 9వందల 23 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో పురుషులు 49వేల 3వందల 86 మంది ఉండగా.. 8వేల 5వందల 37 మంది మహిళా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ లో కొన్ని అభ్యంతరాలు వచ్చినా.. పరిశీలించిన నిపుణుల కమిటీ.. కీ లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.
ఎస్‌ఐ నోటీఫికేషన్ వివరాలు: ఎస్సై పోస్టులకు 2022 డిసెంబర్ 14 నుంచి 2023 జనవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 5 నుంచి హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. ఫ్రిబవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించారు.
కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు: రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2023 జనవరి 22న ప్రాథమిక పరీక్ష రాసిన 4లక్షల 59వేల182 మంది అభ్యర్థుల్లో 95వేల 209 మంది (20.73%) ఉత్తీర్ణులయ్యారు. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల ఆధారంగా ఒక్కో పోస్టుకు 16 మంది పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రాథమిక ఫలితాల్లో అర్హత సాధించిన 95వేల 209 మందికి త్వరలోనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు నియామక మండలి తెలిపింది. వీరు స్టేజ్-2 పరీక్షల కోసం ఈ నెల 13 నుంచి 20 వరకూ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందని తెలిపింది
ఇవీ చదవండి: