Shraddha Murder Case Aftab Narco Test: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటిక్ పరీక్ష విజయవంతంగా పూరైందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. దిల్లీలోని బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో గురువారం సుమారు రెండు గంటలపాటు నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించినట్లు అధికారులు చెప్పారు.
గురువారం ఉదయం 8.40 నిమిషాలకు ఆస్పత్రికి చేరుకున్న అఫ్తాబ్‌కు వైద్యులు వివిధ పరీక్షలు చేశారు. బీపీ, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించారు. తర్వాత నార్కో టెస్టుకు సంబంధించిన సమ్మతి పత్రాన్ని అఫ్తాబ్‌కు చదివి వినిపించారు. ఈ ప్రక్రియల అనంతరం 10 గంటలకు అఫ్తాబ్‌కు నార్కో పరీక్ష నిర్వహించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. సోడియం పెంటోథాల్, స్కోపలామైన్, సోడియం అమైథాల్ను అతడి శరీరంలోకి ఎక్కించినట్లు చెప్పారు. అయితే నార్కోటిక్ పరీక్షలో అఫ్తాబ్‌కు అడిగి ప్రశ్నలు, అతడి సమాధానాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.
'చెల్లుబాటు కావు'
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు నార్కోటిక్ పరీక్ష సక్సెస్ అయిందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నా.. న్యాయ నిపుణులు మాత్రం మరోలా అంటున్నారు. నార్కోటిక్, పాలీగ్రాఫ్ టెస్ట్‌లు ద్వారా వచ్చే నివేదికలు మేజిస్ట్రేట్ ముందు చెల్లుబాటు కావని అభిప్రాయపడుతున్నారు.
"నార్కోటిక్ పరీక్ష అనేది అభ్యంతరకరమైన విచారణ పద్ధతి. అతడు ఏ ఒత్తిడిలో ఉన్నాడో మనకు తెలియదు. కాబట్టి అఫ్తాబ్ భౌతికంగా మేజిస్ట్రేట్ ముందుకు హాజరు కావాలి" అని దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ సోంధీ అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నా అది కూడా చెల్లదని మరో న్యాయవాది నిశాంత్ శ్రీవాస్తవ అన్నారు.
నార్కో అనాలసిస్ టెస్ట్ అంటే ఏంటి?
నార్కో అనాలసిస్ అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్, స్కోపలామైన్, సోడియం అమైథాల్) ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సీరం అని కూడా అంటారు. ఆ వ్యక్తి వయసు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు. స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలనూ స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు. ఆ సమయంలో ఆయన పల్స్, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు. ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్ అందిస్తారు.
పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి. అతడి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. అయితే, నార్కో అనాలసిస్‌లో వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్లను ప్రధాన సాక్షాలుగా కోర్టులు పరిగణించవు. కేవలం వాటిని ఆధారంగానే తీసుకుంటాయి.
35 ముక్కలు కోసి.. మూడు వారాలు ఫ్రిడ్జ్‌లో..
దిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ అనే యువతిని.. అఫ్తాబ్ అనే యువకుడు అతికిరాతకంగా చంపాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి మూడు వారాలకు పైగా ఫ్రిజ్‌లో ఉంచాడు. ఆపై దిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేశాడు. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు.