Power Cut Exchange Of Brides: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో వింత సంఘటన జరిగింది. విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల వధూవరులు మారిపోయి ఒకరి స్థానంలో మరొకరు కూర్చున్నారు. ఉజ్జయిని జిల్లాలోని బద్నగర్ రోడ్డులోని అస్లానా గ్రామంలో నివసించే రమేశ్‌లాల్ రెలోట్కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మే 5న ముగ్గురు కుమార్తెల వివాహం జరగాల్సి ఉంది. వీరిలో రాహుల్‌తో కోమల్‌కు, నికితాకు భోలాతో, గణేశ్‌కు కరిష్మాతో వివాహాలను నిశ్చయించారు. ఈ క్రమంలోనే వివాహ సంప్రదాయాల్లో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి మూడు జంటలు.
అయితే, అదే సమయంలో.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఆ ప్రాంతమంతా చీకటిగా మారింది. దీంతో గందరగోల పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలోనే వధూవరులు మారిపోయి ఒకరి స్థానంలో మరొకరు కూర్చున్నారు. నికితా అనే వధువు గణేశ్‌తో కూర్చోగా.. కరిష్మా అనే వధువు భోలాతో కూర్చుంది. అలాగే కాసేపు పూజలు సైతం చేశారు. మరికొంత సమయం తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలియడం వల్ల ఇరు కుటుంబాలకు మధ్య వివాదం తలెత్తింది. రెండు కుటుంబాలు మాట్లాడుకుని మరుసటి రోజు అమ్మాయిలకు పెళ్లి చేసి వారి భర్తలతో కలిసి పంపించారు.
ఇదీ చదవండి: ఇల్లు కూల్చేస్తారని ఆవేదన.. ఒంటికి నిప్పంటించుకొని వృద్ధుడు ఆత్మహత్య