ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే(99)(Babasaheb purandare) ఇక లేరు. కొన్ని రోజులుగా మహారాష్ట్ర పుణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన(Shivshahir babasaheb purandare).. సోమవారం ఉదయం కన్నుమూశారు(Purandare death). బాబాసాహెబ్ పురందరేగా ప్రాచర్యం పొందిన బల్వంత్ మోరేశ్వర్.. కొద్దిరోజుల క్రితం న్యూమోనియా బారిన పడగా ఆయనను(Babasaheb purandare) ఆస్పత్రికి తరలించారు.
పురందరే(Babasaheb purandare) ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించగా... అత్యవసర విభాగంలో వెంటిలేటర్‌పై ఉంచి, వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆదివారం సాయంత్రం వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 5 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
శివాజీ చరిత్ర ప్రచారంలో..
మహారాష్ట్రతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను ప్రచారం చేయడంలో పురందరే ప్రఖ్యాతిగాంచారు. 'రాజా శివఛత్రపతి' పేరుతో పురందరే.. 900 పేజీల పుస్తకాన్ని మరాఠీలో రచించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ పుస్తకం 1950 చివర్లో తొలిసారి ముద్రణ కాగా.. అనేక సార్లు పునర్ముద్రణకు నోచుకుంది. 1980 మధ్యలో 'జనతా రాజా' పేరుతో శివాజీ చరిత్రపై ఓ నాటకాన్ని ఆయన రచించి, దర్శకత్వం వహించారు. శివాజీపై పురందరే 12వేలకు పైగా ప్రసంగాలు ఇచ్చారు. 2015లో పురందరేను మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ర భూషణ్ పురస్కారంతో సత్కరించగా.. 2019లో కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది.
మోదీ దిగ్భ్రాంతి..
పురందరే మృతిపై(Purandare death) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "నాకు మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది. చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో పురందరే మృతి తీరని లోటు. ఛత్రపతి శివాజీ గురించి రానున్న తరం మరింత అనుబంధాన్ని కలిగి ఉండేందుకు బాబాసాహెబ్ పురందరే ఎంతో కృషి చేశారు" అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా పురందరే మృతిపై విచారం వ్యక్తం చేశారు. శివాజీ చరిత్రను ఎక్కువ మందికి చేర్చడంలో పురందరే ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.
పురందరే అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రకటించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.
ఇదీ చూడండి: శాఖల్లో పారదర్శకత ఇక కేంద్ర మంత్రుల బాధ్యతే!