కర్ణాటకలోని మలేనాడు.. పచ్చదనానికి పెట్టింది పేరు. కానీ.. శివమొగ్గలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ప్రహరి గోడలు స్మార్ట్ సిటీ ఆశయ సాధనకు అవరోధాలుగా మారాయి. పోస్టర్లు, గోడపత్రికలతో అందవిహీనంగా ఉండే ఈ గోడలకు కొత్త రూపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు. వాటిపై అందమైన చిత్రాలు గీస్తూ ఆకర్షణీయంగా మలుస్తున్నారు.
నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలి. అందులో భాగంగానే మా సంస్కృతిని, కళల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించాలన్నది మా ఉద్దేశం. ఇతర ప్రభుత్వ విభాగాల పనిపైనా అవగాహన కల్పించడం మరో ఉద్దేశం. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.35 లక్షల పెట్టుబడితో... కర్ణాటక చిత్రకళా పరిషత్ సహకారంతో గోడలపై చిత్రాలు గీసే పనులు ప్రారంభించాం.
--చిదానంద్ వతారే, కమిషనర్-శివమొగ్గ కార్పొరేషన్.
నగర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై చిత్రాలు గీసే ప్రాజెక్టు కోసం రూ.52 లక్షలు కేటాయించారు. కర్ణాటక చిత్రకళా పరిషత్, నగరపాలక సంస్థ సంయుక్తంగా ఈ పనులు చేస్తున్నాయి. ప్రస్తుతం గోడలన్నీ అందమైన పెయింటింగ్స్‌తో చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పోలీస్ స్టేషన్ ప్రహరి గోడలపై ఉన్న చిత్రాలు చూస్తే... పోలీసులు ఏఏ పనులు చేస్తారో తెలుస్తుంది. తపాలా శాఖ ఎలా పనిచేస్తుందో ఈ వాల్ పెయింటింగ్స్ వివరిస్తాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ఏఏ పనులు చేస్తాయో చిత్రాలు చెబుతాయి. చూసేందుకు చాలా బాగుంటాయి.
--గణేష్, స్థానికుడు.
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరపాలక సంస్థ ఈ కార్యక్రమం ప్రారంభించింది. పోలీసు శాఖ, వన్యప్రాణి విభాగం సహా ఇతర విభాగాలు చేసే పనులు, స్వచ్ఛభారత్ ఆశయాన్ని గోడలపై చిత్రీకరించారు. రాష్ట్ర సంస్కృతి, కళలను ప్రతిబింబించే చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శివమొగ్గలోని ప్రధాన పర్యటక ప్రాంతాల పెయింటింగ్స్ చూపరులను ఆకట్టుకుంటున్న మరో అంశం.
నగరంలోని అన్ని ప్రాంతాల్లోని గోడలపై ఇలాంటి చిత్రాలు గీసి, సుందరంగా తీర్చిదిద్దాలని స్థానికులు అధికారులకు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:ఆకాశవీధిలో శిశువు జననం