కశ్మీర్లో ఓ ఆలయం 31ఏళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని హబ్బాకాదల్లో ఉగ్రవాదం, వలసల కారణంగా మూడు దశాబ్దాల క్రితం మూతపడిన శీతల్నాథ్ ఆలయాన్ని.. వసంత పంచమి సందర్భంగా మంగళవారం తెరిచారు. భైరవుడి దర్శనం కోసం పెద్దఎత్తున భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
"30ఏళ్ల కిందట పూజలు చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడకు తరలివచ్చేవారు. కానీ ఉగ్రవాదం కారణంగా అప్పట్లో ఈ గుడి మూతపడింది. దీంతో కొద్దిరోజులకు పరిసర ప్రాంతాల్లో నివసించే హిందువులంతా ఖాళీచేసి వెళ్లిపోయారు. క్రమంగా ఆలయాన్ని పట్టించుకునేవారే కరవయ్యారు. అయితే.. ఇటీవల స్థానికులు, ముఖ్యంగా ముస్లిం సోదరుల సహకారంతో మళ్లీ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి."
- సంతోశ్ రాజధాన్, స్థానిక భక్తురాలు
హిందూ ఆలయమైనా..
పేరుకే హిందూ ఆలయమైనా ముస్లింలూ పెద్ద సంఖ్యలో వస్తారని స్థానికులు తెలిపారు. ఆలయ పునఃప్రారంభ పనుల్లో అన్నీ తామై సహకరించిన వారు.. భైరవుడి జయంతి(వసంత పంచమి) సందర్భంగా ఏటా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.
కశ్మీర్ 2019 వరకు ఉగ్రహింస చెలరేగగా.. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 8న రాజ్యసభలో వెల్లడించిన లెక్కలే ఇందుకు నిదర్శనం. 2019లో అక్కడ 594 ఉగ్రహింస కేసులు నమోదవ్వగా.. 2020నాటికి ఆ సంఖ్య 244కు తగ్గింది.
ఇదీ చదవండి: పూరీ జగన్నాథుడికి అజ్ఞాత భక్తుడి భారీ కానుక