Shirdi Sai Gold Silver Coins : దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శిరిడి సాయిబాబా ఆలయం ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు శిరిడి సాయిబాబాను దర్శించుకుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల భక్తులే కాకుండా విదేశీయులు సైతం వచ్చి దర్శించుకుని వెళ్తారు. ఫలితంగా కోట్లాది రూపాయిల ఆదాయం వస్తోంది. నగదుతో పాటు కొంతమంది భక్తులు బంగారు, వెండి కానుకలు సమర్పిస్తుంటారు.
అయితే ఇప్పటి వరకు సుమారు 450 కిలోల బంగారం, 6వేల కిలోల వెండిని కానుకలుగా హుండీలో వేశారట భక్తులు. ఈ క్రమంలోనే ట్రస్టులో భారీగా నిల్వ ఉన్న బంగారు, వెండి కానుకల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది శిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్. ఈ కానుకలను కరిగించి పతకాలు, నాణెలను తయారు చేయాలని భావిస్తోంది.
"ఇప్పటివరకు సాయి సంస్థాన్ ట్రస్ట్‌కు సుమారు 450 కిలోల బంగారం, 6వేల వెండిని కానుకగా భక్తులు సమర్పించారు. వీటిలో 155 కిలోల బంగారం, 6వేల కిలోల వెండిని కరిగించాలని నిర్ణయించాం. దాని ద్వారా 5, 10 గ్రాముల నాణెలు, పతకాలను తయారు చేయాలని అనుకుంటున్నాం. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కోరాం. సర్కార్ అనుమతులు రాగానే వెంటనే తయారు చేస్తాం."
--సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రతినిధులు
మరోవైపు శిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాన్ని తుల్జాపుర్ దేవస్థానం సైతం పరిశీలిస్తోంది. తమ ఆలయానికి వచ్చిన బంగారు, వెండి కానుకలను కూడా కరిగించాలని యోచిస్తోంది. ఈ విషయంపై చర్చించడానికి తుల్జాపుర్ దేవస్థాన అధికారులు.. శిరిడి సంస్థాన్ ట్రస్ట్ సభ్యులతో సమావేశమయ్యారు.
పేపర్ లెస్ దేవాలయంగా శిరిడి సాయి సంస్థాన్
అంతకుముందు కూడా ఇలాంటి వినూత్న నిర్ణయమే తీసుకుంది శిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాయి సంస్థాన్ పరిపాలన మొత్తం కాగిత రహితంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు సాయి సంస్థాన్ ఇ-ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో భాగంగా పరిపాలనా వ్యవహారాలు అన్నీ ఇక నుంచి పేపర్‌లెస్‌గా జరుగుతున్నాయి. అంతే కాకుండా సాయి సంస్థాన్ కార్యకలాపాల నిర్వహణ కూడా చాలా పెద్దది. ఇది హైకోర్టు పర్యవేక్షణలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన తాత్కాలిక కమిటీని కలిగి ఉంది. వీటన్నింటినీ చూసేందుకు ఐఏఎస్ ర్యాంక్ అధికారిని నియమించారు. మొత్తం 44 విభాగాల నుంచి అనేక ఫైళ్లు కార్యాలయంలో ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ పేపర్ లెస్‌గా మారనున్నాయి. సాయి సంస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా పెద్ద సంఖ్యలో చెట్లను రక్షించవచ్చు.
కోరికలు తీర్చే 'కల్పవృక్షం'! సాయిబాబా ధ్యానం చేసింది ఇక్కడే! ఈ చెట్టుకు 200 ఏళ్ల చరిత్ర!
దీపావళి సెలవుల్లో శిరిడీకి భారీగా భక్తులు - హుండీ ద్వారా 17 కోట్లు