షిర్డీ సాయిబాబాకు కాకడ్ హారతి విషయంలో అనేక ఏళ్ల తర్వాత కీలక మార్పులు వచ్చాయి. లౌడ్స్పీకర్లు లేకుండానే వేకువజామున హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు. బుధవారం ఉదయం నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు.
సాయి బాబాకు రోజులో నాలుగు సార్లు అర్చకులు హారతి ఇస్తారు. ఉదయం 5.15 గంటలకు కాకడ్ హారతి ప్రారంభం అవుతుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు అనేక మంది భక్తులు వేకువజామునుంచే ఆలయంలో ఎదురుచూస్తారు. అయితే.. బుధవారం మాత్రం కాస్త భిన్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. "పోలీసుల నుంచి మాకు ఓ లేఖ అందింది. లౌడ్స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వారు ప్రస్తావించారు. వాటిని అనుసరించి ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి" అని వివరించారు షిర్డీ సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి భాగ్యశ్రీ బనాయత్. షిర్డీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గులాబ్రావ్ పాటిల్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే.. ఆ సమయంలో అజాన్ కోసం కూడా లౌడ్స్పీకర్లను వినియోగించలేదని స్పష్టం చేశారు.
లౌడ్స్పీకర్లు వాడాల్సిందే!: లౌడ్స్పీకర్లు లేకుండా కాకడ్ హారతి నిర్వహించడంపై షిర్డీలోని జమా మసీద్ ట్రస్ట్, స్థానిక ఇస్లాం పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ఏళ్లుగా ఉన్న పద్ధతిని అలానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బాబా ఆలయం.. షిర్డీకి అంతర్జాతీయంగా ఖ్యాతిని తెచ్చిందని, మతసామరస్యానికి ప్రతీకని అన్నారు.
ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలతో మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అదే సమయంలో లౌడ్స్పీకర్ల వినియోగంపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. చర్చనీయాంశమయ్యాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పక్కాగా అమలయ్యేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లు ఉపయోగించరాదన్నది సుప్రీం మార్గదర్శకాల్లో ఒకటి.