Shantanu Thakur Whatsapp Exit: కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వశాఖ సహాయమంత్రి శాంతను ఠాకూర్.. బంగాల్ భాజపా వాట్సాప్ గ్రూప్స్ నుంచి వైదొలిగారు. ఠాకూర్ బంగాల్లోని దళిత వర్గమైన మతువా కమ్యూనిటీ నుంచి కీలక నేతగా ఉన్నారు. తమకు(మతువా వర్గానికి) పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
"మతువా వర్గం కీలకం కాదని భాజపా నాయకత్వం అనుకుంటోంది. రాష్ట్రంలోని భాజపా వర్గాల్లో నాకు కూడా ప్రాధాన్యం ఉందని అనుకోవటం లేదు. కానీ పార్టీకి మాత్రం విధేయుడిగా ఉంటాను"
-- శాంతను ఠాకూర్, జలమార్గాల మంత్రిత్వశాఖ సహాయమంత్రి
శాంతనూ బాటలో మరో ఎమ్మెల్యే..
బంగాల్‌కు చెందిన నటుడు, భాజపా ఎమ్మెల్యే హిరన్ ఛటర్జీ కూడా భాజపా వాట్సాప్ గ్రూప్స్‌ను వీడారు. అయితే పార్టీని వీడే ఉద్దేశం లేదన్నారు. "నా సేవలు రాష్ట్ర భాజపాకు నా సేవలు అవసరం లేదనుకుంటా.. నాకు తెలియకుండానే నా నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు పూర్తవుతున్నాయి"అని ఛటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
వారం క్రితమూ.. ఇలానే ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలు ముక్తోమోని అధికారి, సుభ్రతా ఠాకూర్, అంబికా రాయ్, అశోక్ కిర్తానియా, అసిమ్ సర్కార్ వాట్సాప్ గ్రూప్స్ నుంచి వైదొలిగారు. భాజపా రాష్ట్ర, జిల్లా కమిటీల నుంచి మతువా వర్గానికి చెందిన నేతలను తీసివేయడంపై నిరసనగా వాళ్లు వాట్సాప్ గ్రూప్స్‌కు గుడ్‌బై చెప్పారు.
అయితే శాంతను.. భాజపా వాట్సాప్ గ్రూప్‌లకు గుడ్‌బై చెప్పడంపై బంగాల్ భాజపా అధ్యక్షుడు సుకంతా మజూందార్ స్పందించారు. శాంతను నిర్ణయానికి గల కారణాలను పరిశీలిస్తామన్నారు. భాజపాలో ఆయన ఎంతో క్రియాశీలకంగా పనిచేశారన్నారు.
ఇదే విషయంపై తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ స్పందించారు. మతువా వర్గాన్ని భాజపా.. కేవలం ఓట్ల కోసమే వాడుకుందని మండిపడ్డారు.
ఇదీ చూడండి: మోదీ పంజాబ్ పర్యటనలో సెక్యూరిటీ ప్రాబ్లం- హుటాహుటిన దిల్లీకి..