ముంబయి శక్తి మిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో (shakti mills case) ముగ్గురు దోషులకు విధించిన మరణశిక్షను బాంబే హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. దోషులు పశ్చాత్తాప పడడానికి జీవిత ఖైదు తప్పనిసరని పేర్కొంది. అత్యాచారం మహిళ గౌరవానికి తీవ్రమైన దెబ్బగా పేర్కొన్న ధర్మాసనం.. దోషులు సమాజంలో బతకడానికి అనర్హులని స్పష్టం చేసింది. జస్టిస్ సాధన జాదవ్, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. పెరోల్ వంటి సదుపాయాలు దోషులకు ఉండవని స్పష్టం చేసింది.
ట్రయల్ కోర్టు దోషులకు మరణ శిక్ష విధించిన ఏడేళ్లకు ఈ తీర్పు (mbai shakti mills case verdict) వచ్చింది.
శక్తిమిల్స్ సామూహిక అత్యాచార ఘటన హేయమైంది. ఈ కారణంగా బాధితురాలు శారీరకంగానే కాకుండా మానసికంగా తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనే. కానీ ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆందోళనను మాత్రమే పరిగణనలోకి తీసుకోలేం. మరణం పశ్చాత్తాప భావనకు ముగింపు పలుకుతుంది.'
-హైకోర్టు ధర్మాసనం
2013లో ముంబయిలోని శక్తి మిల్స్ కాంపౌండ్‌లో 22 ఏళ్ల ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు జాదవ్(19), ఖాసిమ్ షైక్(21), అన్సారీ(28)ని దోషులుగా 2014లోనే తెల్చింది ట్రయల్ కోర్టు. మరో దోషి సిరాజ్ ఖాన్ మైనర్ అయినందున అతనికి జీవిత ఖైదు విధించింది. మరణశిక్ష పడిన దోషులు హైకోర్టును ఆశ్రయించారు.
ఆ కిరాతకుడికి ఉరే సరి...
మరోవైపు... మూడేళ్ల బాలికను హత్యాచారం చేసిన కేసులో దోషికి ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను సమర్థించింది బాంబే హైకోర్టు. దోషి పాల్పడింది హేయమైన చర్యగా వ్యాఖ్యానించింది. నేరం పట్ల దోషికి ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని పేర్కొంది.
2013లో ఓ చిన్నారిని(3) ఇంటికి వాచ్‌మెన్‌గా పనిచేసే రామ్‌కిరాత్ గౌడ్ అత్యాచారం చేశాడు. అనంతరం చంపేసి బురదలో పడేశాడు. ఈ కేసులో రామ్ కిరాత్కు 2019లోనే పోక్సో చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
ఇదీ చదవండి:హైవేపై కారులో వెళ్తూ గ్యాంగ్‌రేప్.. ఎస్సై కావాల్సిన యువతిపై...