అసోం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యూహమంటూ ఏమీ లేదని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. అభివృద్ధి జరగలాంటే రాష్టంలో భాజపా మళ్లీ అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. మంగళవారం అసోం ఎన్నికల చివరి దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బార్పేటా జిల్లా ప్రచార సభలో పాల్గొన్నారు షా.
"అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని విడగొడుతుంది. కానీ, భాజపా సబ్కా సాత్, సబ్కా వికాస్(అందరితో కలిసి, అందరి కోసం) సూత్రాన్ని పాటిస్తుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి పర్యటకుడిలా వస్తుంటారు. సమస్యలను పరిష్కరించడం ఎలాగో ఆ పార్టీకి తెలియదు."
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
వరదలు పోటెత్తకుండా అసోంను అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతినబూనిందని షా గుర్తు చేశారు. బంగాల్‌లోనూ భాజపా అధికారంలో రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
దిల్లీకి పయనం..
ఛత్తీస్‌గఢ్ బీజాపుర్‌లో నక్సల్స్ ఎన్కౌంటర్ దృష్ట్యా అమిత్ షా అసోం పర్యటనను ముందుగానే ముగించుకుని దిల్లీకి బయలుదేరినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. మూడు ర్యాలీల్లో షా ఒక ర్యాలీకే హాజరైనట్లు చెప్పారు.
ఇదీ చదవండి:'మోదీ దేవుడా? మానవాతీత శక్తా?'