Sexual Harassment On Woman Judge : సమాజంలో ప్రత్యేక గౌరవం కలిగి ఉండి, అందరికీ న్యాయం చేసే ఒక మహిళా జడ్జికే పని ప్రదేశంలో అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సివిల్ జడ్జికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తనతో పనిచేస్తున్న కొందరు సీనియర్లు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు బహిరంగ లేఖ రాశారు.
'ప్రతి తలుపు తట్టాల్సి వస్తోంది'
సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయ వృత్తిలో చేరిన తనకు ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోందని లేఖలో ఆ మహిళా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా జిల్లా జడ్జి, ఆయన అనుచరులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని, రాత్రి వేళల్లో జిల్లా జడ్జిని ఒంటరిగా కలవమంటున్నారని మహిళా జడ్జి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
'ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు'
పని ప్రదేశంలో జరుగుతున్న లైంగిక వేధింపులను తాను ఈ జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆ మహిళా జడ్జి లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా జడ్జి కింద పని చేసేవారేనని, తమ బాస్‌కు వ్యతిరేకంగా వారు సాక్ష్యం చెప్పగలరని తాను ఎలా నమ్మగలనని ఆమె లేఖలో ప్రశ్నించారు.
'8సెకన్లలోనే అభ్యర్థనను కొట్టివేశారు'
అందుకే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు జడ్జిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని, కానీ ఎనిమిది సెకన్లలోనే తన అభ్యర్థనను కొట్టివేశారని వివరించారు. గత ఏడాదిన్నరగా తానో జీవచ్ఛవంలా బతుకుతున్నానని, తాను బతికుండి ప్రయోజనం లేదని గౌరవప్రదంగా చనిపోయేందుకు తనకు అనుమతి ఇవ్వాలని లేఖలో మహిళా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు.
రంగంలోకి సీజేఐ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మహిళా జడ్జి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ లేఖ వ్యవహరం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి రావడం వల్ల ఆయన చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను అతుల్ ఎం కుర్హేకర్ ఆదేశించారు. మహిళా న్యాయమూర్తి ఫిర్యాదు, దానిపై విచారణకు సంబంధించిన మొత్తం వివరాలను సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు.
పార్లమెంట్లో మహిళా ఎంపీపై లైంగిక దాడి..
మహిళా ఐపీఎస్‌పై కారులో లైంగిక వేధింపులు.. మాజీ ఏడీజీపీకి మూడేళ్ల జైలు శిక్ష