కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినా.. కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గడం లేదు. దీంతో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని సీఎం యడియూరప్ప యోచిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ పెట్టాలా? వద్దా ? అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన తెలిపారు.
దేశ ప్రధానిగా మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము అమలు చేస్తామని తెలిపారు. ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీ రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ఆంక్షలున్నా అంతే..
ఏప్రిల్ 27 రాత్రి నుంచి మే 12 వరకు కర్ణాటకలో పాక్షిక లాక్‌డౌన్ పేరుతో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీనివల్ల కూడా కేసుల్లో తగ్గుదల కనిపించకపోగా.. సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
బంగాల్లో స్థానిక రైళ్లు రద్దు
కొవిడ్ కట్టడికి బంగాల్ ప్రభుత్వం నూతన ఆంక్షలు విధించింది. స్థానిక రైళ్లను గురువారం నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మెట్రోరైళ్లు, ప్రభుత్వ రవాణా సేవలు.. 50 శాతం ప్రయాణికులతోనే పనిచేస్తాయని పేర్కొంది. మే 7 నుంచి రాష్ట్రంలోకి వచ్చే విమాన ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలని స్పష్టం చేసింది. బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకే పనిచేస్తాయని ప్రభుత్వం వివరించింది. రోడ్డు, రైలు మార్గంలో వచ్చే ప్రయాణికులు సైతం నెగెటివ్ రిపోర్టు చూపించాలని స్పష్టం చేసింది.
హిమాచల్‌లో లాక్‌డౌన్
మే 7 నుంచి 16 వరకు పది రోజులు లాక్‌డౌన్ విధించనుంది హిమాచల్‌ప్రదేశ్ సర్కారు. రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలని స్పష్టం చేసింది. అత్యవసర సేవలు మినహా అన్నింటిని మూసివేస్తున్నట్లు పేర్కొంది. అలాగే పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది.
సిక్కింలో కర్ఫ్యూ
రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కర్ఫ్యూ విధించింది సిక్కిం ప్రభుత్వం. సైనిక వాహనాలు, అత్యవసర వస్తువులు తరలిస్తున్న వాహనాలు తప్ప మిగిలిన వాటిని నిషేధించింది.
వారం రోజులు క్వారంటైన్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు.. కరోనా పరీక్షలు చేయించుకుని వారం రోజులు క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ఝార్ఖండ్ సర్కారు.
ఇదీ చూడండి: చేతులు పదేపదే కడుగుతున్నారా?