Lightning Death In Bihar : బిహార్‌లో 24 గంటల వ్యవధిలో పిడుగుపాటుకు గురై 32 మంది మరణించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల పరిధిలో ఈ మరణాలు సంభవించాయి. రోహ్తాస్ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు. బంకా, జెహనాబాద్, భాగల్పుర్, జముయీ, బక్సర్ జిల్లాలో చెరో ముగ్గురు.. గయా, సుపాల్, నలంద జిల్లాలో చెరో ఇద్దరు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఔరంగాబాద్, శివహర్, ఖగాడియా, కటిహార్, కైముర్ జిల్లాలో ఒక్కొక్కరు పిడుగుపాటు వల్ల మరణించారు.
బిహార్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లవద్దని సూచించింది. చెట్ల కింద గుమిగూడవద్దని.. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. పిడుగుపాటుకు గురై మరణించినవారి కుటుంబాలకు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పిడుగుపాటు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఆదేశించారు. ఇంద్ర వజ్ర యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలను అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇంద్రవజ్ర యాప్.. పిడుగుపాటు మరణాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా పిడుగు పడే అవకాశం ఉన్న సమయం, ప్రదేశం కొంత ముందుగానే తెలుసుకోవచ్చని ప్రజలకు సూచించారు. ఇంద్రవజ్ర యాప్.. పిడుగుపడే 40 నుంచి 45 నిమిషాల ముందు అలారం మోగుతందని.. వెంటనే ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రదేశానికి చేరుకోవచ్చని చెప్పారు.
Bihar Lightning Strike: గతేడాది జులైలో బిహార్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కైమూర్ జిల్లాలోనే అత్యధికంగా ఏడుగురు మరణించగా.. భోజ్‌పుర్, పట్నాలో నలుగురు చొప్పున, జెహనాబాద్, అర్వాల్, రోహ్తాస్, సివాన్, ఔరంగాబాద్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.