Road Accident in Sathyasai District: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రదొడ్డి వద్ద జాతీయ రహదారి 42పై జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముదిగుబ్బ వైపు నుంచి కదిరికి వస్తున్న ఆటోను.. కదిరి వైపు నుంచి నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి చెందిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బుక్కపట్నం మండలం మదిరే బైలు తండాకు చెందిన ఆటో డ్రైవర్ భాస్కర్ నాయక్, చిన్నస్వామి నాయక్, చలపతి నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న శ్రీలేఖ నిశాంత్, కారులో ఉన్న రజనీష్ రెడ్డి, రామ్మోహన్‌కు గాయాలయ్యాయి. శ్రీలేఖ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన రజనీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పి.. ఆందోళన విరమింప చేశారు.
Road Accident at Warangal : నిర్లక్ష్యం ఖరీదు... ఆరుగురు వలస కూలీలు మృతి
Five Died in Road Accident: మరోవైపు బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున నరసరావుపేట నుంచి వినుకొండ రోడ్డు వైపు వెళ్తున్న లారీ.. మార్కాపురం నుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తుండగా ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి వైద్యం కొనసాగుతోంది. మృతి చెందిన వారిలో బెలిమెళ్ల కవిత, అలివేలు మంగతాయారు, పాల్తి నరి, తమ్మిశెట్టి తులసి, బుర్రి మాధవి ఉన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా గుంటూరుకు చెందిన కేటరింగ్ సిబ్బందిగా పోలీసులు గుర్తించారు.
Two youths died in Anantapur district: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పొలికి సమీపంలో చోటుచేసుకుంది. రాత్రి పొద్దుపోయిన తరువాత గుంతకల్లుకు చెందిన బాలుతో పాటు మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై హాంచనహాళ్ నుంచి పొలికి వైపు వస్తున్నారు. పొలికి గ్రామానికి చెందిన వర్దన్‌తో పాటు మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై హంచనహాళ్ వైపు వెళ్తున్నారు. ఆ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలు (18) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వర్దన్ (20) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విడపనకల్లు ఎస్సై తిప్పయ్య నాయక్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాలను శవ పరీక్ష కోసం తరలించారు. ఇదే ప్రమాదంలో గుంతకల్లుకు చెందిన షికారు రాహుల్, షికారు బాలికి, పొలికి గ్రామానికి చెందిన మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి వివరాలు తెలియాల్సి ఉంది. గుంతకల్లుకు చెందిన వారు రాత్రి వేళ పొలికి వద్ద పొలాల్లో కాపలా ఉండటానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.