దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీ సోమవారం.. టీకా తొలి డోసు వేసుకొని రెండోవిడత వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా.. మంగళవారం పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో టీకా వేయించుకున్నారు. టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పట్నా ఎయిమ్స్‌లో, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో కరోనా టీకా వేసుకున్నారు. వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ఆయన భార్యతో కలిసి దిల్లీ హార్ట్ అండ్ లంగ్స్ ఇన్స్టిట్యూట్లో టీకా తీసుకున్నారు. వీరిరువురు డోసుకు రూ.250 చొప్పున చెల్లించారు. రవిశంకర్ ప్రసాద్ సైతం కొవిడ్ టీకాకు డబ్బులు చెల్లించారు. కేంద్ర మంత్రులందరు స్వచ్ఛందంగా టీకా రుసుం చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. శ్రీనగర్‌లో టీకా వేసుకున్నారు. క్రికెట్ కోచ్ రవిశాస్త్రి అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. తమిళనటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్.. చెన్నైలో కొవిడ్ టీకాను వేయించుకున్నారు.










