Road Accident: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కైమూర్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు.. ఈ-రిక్షా బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ట్రక్కు రాంగ్ రూట్లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
లోయలో పడిపోయిన కారు.. ఉత్తరాఖండ్‌లో ఆదివారం మరో ఘోర ప్రమాదం జరిగింది. బెరినాగ్ ప్రాంతంలో ఓ వాహనం.. 100 అడుగుల లోతైన లోయలో అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
నైనితాల్ జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చందన్ సింగ్(61) తన స్వగ్రామమైన బసేదాలో ప్రార్థనలు చేసి ఆ తర్వాత కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. చందన్ సింగ్ భార్య తులసీ దేవి సహా అతడి తమ్ముడు, మరదలు అక్కడిక్కడే మృతి చెందగా.. తల్లి దేవకీ దేవి ఆసుపత్రిలో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన చందన్ సింగ్, అతడి మరో తమ్ముడు గోవింద్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి: మేఘాలయలో భూప్రకంపనలు.. తుర్కియే, టిబెట్ దేశాల్లోనూ..
ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. వాచ్మెన్ కుటుంబం త్రుటిలో..