ఉత్తర్‌ప్రదేశ్‌లో నిద్రిస్తున్న ఐదుగురిని గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురిని చంపిన అనంతరం.. నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మైన్‌పురి జిల్లాలోని గోకుల్పుర్లో శనివారం వేకువజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
గోకుల్పుర్కు చెందిన శివవీర్ యాదవ్(30).. తన సోదరులు భుల్లన్ యాదవ్(25), సోనూ యాదవ్(21), సోనూ భార్య సోనీ(20), బావ సౌరభ్(23), స్నేహితుడు దీపక్‌పై(20) గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం భార్య డాలీ, మేనత్తపై దాడికి పాల్పడ్డాడు. తర్వాత తనను తాను గన్‌తో కాల్పులకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయాలపాలైన నిందితుడు శివవీర్ యాదవ్ మేనత్త, భార్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు శివవీర్ ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, నిఘా పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. శివవీర్.. శుక్రవారం ఇటావా నుంచి గోకుల్పుర్కు వచ్చాడని పోలీసులు తెలిపారు. అందరూ నిద్రిస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు.
రూ.1,500 కోసం ఫ్రెండ్ హత్య..
రూ.1,500 కోసం స్నేహితుడిని కత్తితో పొడి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో శుక్రవారం రాత్రి జరిగింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
నీరజ్ త్రివేది, చుట్టాన్ అనే ఇద్దరు యువకులు మంచి స్నేహితులు. వీరిద్దరూ శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. రూ.1,500 కోసం మద్యం మత్తులో ఉన్న నీరజ్, చుట్టాన్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెరిగి.. నీరజ్ త్రివేదిని చుట్టాన్ కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు నీరజ్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన నీరజ్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు నీరజ్ స్వస్థలం బహ్రైచ్ అని పోలీసులు తెలిపారు. అతడు పెయింటర్ అని చెప్పారు.
కానిస్టేబుల్ హత్య..
ఝార్ఖండ్.. రామ్‌గఢ్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు గుర్తుతెలియని దుండగులు. విధులు నిర్వర్తించి బైక్‌పై ఇంటికి వెళ్తున్న పంకజ్ దాస్ కుమార్‌పై భుర్కుంద పోలీస్ స్టేషన్ సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న భుర్కుంద పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంకజ్ దాస్.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్షల పరీక్షల నిమిత్తం రామ్‌గఢ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏ కారణాల వల్ల కానిస్టేబుల్‌ను.. దుండగులు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి రెండు నెలల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.
కన్న కూతుర్లును గొంతు నులిమి..
కన్నకూతుర్లను గొంతు నులిమి హత్య చేశాడు ఓ తండ్రి. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ దారుణం ఉత్తరాఖండ్.. దెహ్రాదూన్‌లో శుక్రవారం జరిగింది.
కేశవపురికి చెందిన జితేంద్ర సాహ్ని అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. దర్యాప్తు చేపట్టారు. మృతులను ఆంచల్(3), మరో అనిసా(ఏడాదిన్నర)గా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. చిన్నారులను వారి తండ్రి హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.