Senthil Balaji News : తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఏకపక్షంగా బర్తరఫ్ చేశారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి. సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు గురువారం రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. బాలాజీ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని రాజ్‌భవన్ తన ప్రకటనలో తెలిపింది. ఉద్యోగాలు అమ్ముకున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయని వెల్లడించింది. మంత్రిగా ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశముందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సెంథిల్ బాలాజీపై ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది. మరికొన్ని ఇతర కేసులు సైతం రాష్ట్ర పోలీసుల అధ్వర్యంలో దర్యాప్తులో ఉన్నాయి.
సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగితే న్యాయపరమైన చర్యలు అడ్డుకుంటారని.. రాష్ట్రంలో రాజ్యాంగ నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందని రాజ్‌భవన్ తన ప్రకటనలో వివరించింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది.
'న్యాయపరంగా ఎదుర్కొంటాం'
Tamil Nadu CM MK Stalin: అయితే, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సంప్రదించకుండానే మంత్రి మండలి నుంచి సెంథిల్ బాలాజీని తొలగించడంపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన సీఎం స్టాలిన్.. గవర్నర్ రవి తీరును తప్పుబట్టారు. గవర్నర్‌కు ఆ హక్కులేదని.. ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు.
2016లో రవాణా శాఖలో నియామకాల కోసం ముడుపులు తీసుకున్నారని సెంథిల్ బాలాజీపై ఆరోపణలున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయనపై ఈడీతో పాటు ఇతర జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణకు పూనుకున్నాయి. 2023 జూన్ 14న సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. అనుకోకుండా బాలాజీకి ఛాతినొప్పి రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. జూన్ 21న బాలాజీకి సర్జరీ కూడా జరిగింది. దీంతో బాలాజీని కస్టడీలోకి తీసుకున్నప్పటకీ ఈడీ విచారణ చేయలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. జూలై 12 వరకు బాలాజీ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా సెంథిల్ బాలాజీ ఎటువంటి శాఖ లేకుండానే మంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం గవర్నర్ ఆదేశాలతో బర్తరఫ్ అయ్యారు.