కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆస్పత్రిలో చేరారు. మోకాలి చికిత్స కోసం ఆయన మంగళవారం రోజున హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు వైద్య చికిత్సలు నిర్వహించిన డాక్టర్లు గుండెలో రక్తనాళం పూడుకున్నట్లు గుర్తించారు. వెంటనే గుండె చికిత్స ప్రారంభించి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ముందుగానే గుండె సమస్య గుర్తించడం వల్ల ప్రమాదం తప్పిందని అన్నారు. జానారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.
జానారెడ్డి తొలుత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో చలకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు గెలుపొందారు. వివిధ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి నెలకొల్పిన రికార్డును ఆయన అధిగమించారు. ఈ క్రమంలోనే 2021 సంవత్సరంలో నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు.
తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయమే తమకు శిరోధార్యమని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందా అని విలేకరులు అడగ్గా.. ‘ఎన్నికలొచ్చినప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు’ అని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో.. పొత్తు విషయం అధిష్ఠానం నిర్ణయిస్తుందంటూ సాయంత్రం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉన్నందునే బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. రాహుల్ గాంధీకి మద్దతిచ్చినంత మాత్రాన తెలంగాణలో బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని అనుకోవడం అమాయకత్వమే అవుతుందని జానారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో సింగరేణి బృందం.. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన ఉక్కు పోరాట కమిటీ
కర్ణాటక ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా రిలీజ్.. ఆ స్థానం నుంచే బొమ్మై పోటీ