ఒడిశాలో మరో రష్యా టూరిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందారు. రష్యా చట్టసభ్యుడు, ఫిలాంథ్రపిస్ట్ పావెల్ ఆంటోవ్ ఓ హోటల్లో విగతజీవిగా కనిపించారు. మూడో ఫ్లోర్‌లోని తన గది కిటికీ నుంచి ఆయన కింద పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. రోజుల వ్యవధిలో రెండో రష్యన్ టూరిస్ట్ ఇలా చనిపోవడం గమనార్హం.
రష్యాకు చెందిన పావెల్ ఆంటోవ్ ఓ కుబేరుడు. రష్యా చట్టసభ్యుడైన ఆయన.. తన 65వ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకునేందుకు ఒడిశాలోని రాయగడ ప్రాంతానికి వచ్చారు. డిసెంబర్ 25న పావెల్ ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ వివేకానంద శర్మ తెలిపారు.
కాగా, పావెల్ మృతికి మూడు రోజుల ముందు ఆయన పార్టీకే చెందిన మరో నేత ప్రాణాలు కోల్పోయారు. వ్లాదిమిర్ బుదానోవ్(61) అనే రష్యన్ నేత రాయగడలోని అదే హోటల్లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. పావెల్, వ్లాదిమిర్ సహా నలుగురు రష్యన్లు డిసెంబర్ 21న రాయగడలోని హోటల్లో దిగారు. ఈ హోటల్‌కు వచ్చే ముందు.. ప్రముఖ పర్యటక ప్రదేశమైన కందామల్ జిల్లాలోని దారింగ్బాడీని వీరంతా సందర్శించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 22న ఉదయం వ్లాదిమిర్ చనిపోయారు. గుండెపోటుతో ఆయన చనిపోయారని ఎస్పీ వివేకానంద శర్మ తెలిపారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. పావెల్ మృతదేహాన్ని మాత్రం భద్రపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.
"డిసెంబర్ 21న నలుగురు వ్యక్తులు రాయగడలోని ఓ హోటల్‌కు వచ్చారు. అందులోని ఓ వ్యక్తి (వ్లాదిమిర్)డిసెంబర్ 22న ఉదయం చనిపోయారు. గుండెపోటు వల్ల ఆయన చనిపోయారని శవ పరీక్షలో తేలింది. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాం. వ్లాదిమిర్ మృతిని ఆయన స్నేహితుడు (పావెల్) తట్టుకోలేకపోయారు. పావెల్ డిసెంబర్ 25న ప్రాణాలు కోల్పోయారు."
-రాయగడ ఎస్పీ వివేకానంద శర్మ
సీఐడీ దర్యాప్తు..
ఈ కేసులో ఇప్పటివరకైతే తమకు అనుమానాస్పదంగా ఎలాంటి విషయాలు బయటపడలేదని ఒడిశా డీజీపీ సునీల్ బన్సల్ తెలిపారు. ఈ కేసును సీఐడీకి అప్పగించినట్లు వెల్లడించారు. సీఐడీ-క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేయనుందని, ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారని ఒడిశా పోలీసు శాఖ ట్విట్టర్లో తెలిపింది.
ప్రస్తుతం హోటల్లో మరో ఇద్దరు టూరిస్టులు ఉన్నారని హోటల్ మేనేజర్ కౌశిక్ ఠక్కర్ తెలిపారు. రష్యా ఎంబసీ నుంచి డాక్యుమెంట్లు వచ్చిన తర్వాత వీరు వెళ్లిపోతారని తెలిపారు. "తొలి టూరిస్టు స్పృహ కోల్పోయి పడి ఉండటం గమనించి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆయన చనిపోయినట్లు తేలింది. ఆయన మృతి పట్ల మానసికంగా కుంగిపోయిన మరో టూరిస్ట్.. హోటల్ ప్రాంగణంలో పడిపోయి కనిపించారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు తేలింది" అని మేనేజర్ ఠక్కర్ చెప్పుకొచ్చారు.
వ్లాదిమిర్ అప్పటికే అనారోగ్యానికి గురయ్యారని.. రష్యన్లకు గైడ్‌గా వ్యవహరించిన జితేంద్ర సింగ్ తెలిపారు. ఉదయం వెళ్లి ఆయన గదిని తెరిచి చూసేసరికి నేలపై పడిపోయి ఉన్నారని చెప్పారు. కాగా, బతికి ఉన్న రష్యా టూరిస్టులలో ఒకరైన తురోవ్ మైఖెల్.. ఈ ఘటనపై స్పందించడానికి ఇష్టపడలేదు.
కాగా, పావెల్ మృతిని రష్యా ప్రాంతీయ పార్లమెంట్ ఉప-స్పీకర్ వ్యాచెస్లావ్ కార్తుఖిన్ ధ్రువీకరించారు. 'మా సహచరుడు విజయవంతమైన వ్యాపారవేత్త. ఆయన చనిపోయారు. చట్టసభకే కాకుండా వ్లాదిమిర్ ప్రాంతం మొత్తానికి ఆయన మరణం తీరని లోటు. మా యునైటెడ్ రష్యా పార్టీ తరఫున ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నాం. పావెల్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రులకు మా సానుభూతి' అని వ్యాచెస్లావ్ పేర్కొన్నారు.