కొవిడ్ నిబంధనల నడుమ పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4గం.నుంచి రాత్రి 9గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ సచివాలయం బులిటెన్‌లో ప్రకటించింది. జనవరి 29న ప్రారంభమైన పార్లమెంట్ తొలివిడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13వరకు కొనసాగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 వార్షిక బడ్జెట్ ప్రవేళపెట్టారు. అనంతరం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం, బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది. వీటితో పాటు వ్యవసాయ చట్టాలపైనా చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్ మార్చి 8వరకు వాయిదా పడింది.
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజా సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అందులో పింఛన్ ఫండ్ రెగ్యులేటరి అండ్ డెవలప్మెంట్ అథారిటి బిల్, విద్యుత్ సవరణ బిల్లు, క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లులు ఉన్నాయి.
కుదించే అవకాశం?
తొలి విడతలో మొత్తం 49 గంటల 17నిమిషాల పాటు చర్చ జరిగిందని లోక్‌సభ కార్యాలయం తెలిపింది. వీటిలో అత్యధికంగా 16గంటల 39 నిమిషాలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి తీసుకున్నట్లు ప్రకటించింది. మరో పది గంటలను సాధారణ బడ్జెట్‌పై చర్చ జరిపేందుకు కేటాయించగా, మొత్తం 117మంది పార్లమెంట్ సభ్యులు చర్చలో పాల్గొన్నట్లు వెల్లడించింది. మార్చి 8న ప్రారంభమయ్యే ఈ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బులిటెన్‌లో వెల్లడించారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో రెండో విడత బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు రెండువారాలపాటు తగ్గించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే సోమవారం జరిగే సభాపక్ష నేతల సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వ్యాక్సినేషన్ కేంద్రాలు
ఇక దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోన్న నేపథ్యంలో అటు పార్లమెంట్‌లోనూ రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. పార్లమెంట్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమాచారం ప్రకారం, 36శాతం మంది లోక్‌సభ, 62శాతం మంది రాజ్యసభ సభ్యుల వయసు 60 సంవత్సరాలకు పైబడినవారే ఉన్నారు.