జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ సరస్సు మరోసారి గడ్డకట్టింది. అక్కడి ఉష్ణోగత్రలు కనిష్ఠస్థాయికి పడిపోవడం వల్ల దాల్ సరస్సుతోపాటు పలు జలాశయాలు గడ్డకట్టాయి. నీరంతా ఘనీభవించడంతో దాల్ సరస్సులో పడవ ప్రయాణాలు కష్టతరంగా మారాయి. చాలా చోట్ల తాడు సాయంతో నాటు పడవలు నడుపుతున్నారు.
చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ దాల్ సరస్సు అందాలను చూసేందుకు పర్యటకులు ఆసక్తి చూపుతున్నారు. గడ్డకట్టిన సరస్సులోని మంచు ముక్కలను సేకరిస్తూ చిన్నారులు కేరింతలు కొడుతున్నారు.
శ్రీనగర్‌లో శీతల రాత్రి..
శ్రీనగర్‌లో గత రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠాన్ని నమోదు చేసినట్లు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2018 డిసెంబర్లో నమోదైన ఉష్ణోగ్రత కంటే ఈ రాత్రి మైనస్ 6.6డిగ్రీలుగా నమోదైనట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఇదే కనిష్ఠం కావడం విశేషం. మరోవైపు లద్దాఖ్‌లో మైనస్ 29 డిగ్రీలకు పడిపోయింది. ఇప్పటివరకు లద్దాఖ్‌లో ఇదే అత్యల్పం.