కశ్మీర్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ ఎన్‌కౌంటర్ (terrorist attack) జరుగుతోంది. పూంచ్‌లోని మెందహార్, సురాన్ కోటె, రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో చేపడుతున్న గాలింపు చర్యలు శనివారంతో 20 రోజులకు చేరుకున్నాయి. రెండు సార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటికి 9మంది సైనికులు మృతి చెందారు.
అక్టోబర్ 11వ తేదీన సురాన్‌కోటె వద్ద గస్తీ బృందాలపై ఉగ్రవాదులు (terrorist groups in india) దాడి చేసి ఐదుగురిని హత్యచేశారు. 14వ తేదీన మెందహార్ వద్ద మరోసారి దాడి చేశారు. ఈ ఘటనలో మరోనలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే ఇద్దరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లతో సహా.. తొమ్మిది మంది సిబ్బందిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మరోసారి ప్రాణనష్టం జరగకుండా దళాలు ఇక్కడ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళుతున్నాయి.
ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశం పూంచ్-రాజౌరీ జాతీయ రహదారికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భాటా దురియాన్ అడవిలో ఉంది. ఈ చిక్కటి అడవిలో ఉగ్రవాదులు నక్కి భద్రతా దళాలపై దాడులు చేస్తున్నారు. దీంతో భద్రతా దళాలు జమ్ము-రాజౌరీ జాతీయ రహదారిని మూసివేశాయి. వివిధ రకాల ఆయుధాలను దళాలు ఈ ఎన్‌కౌంటర్‌లో వినియోగిస్తున్నాయి.
ఉగ్రవాదులకు ఆహారం, ఇతర సామగ్రిని సమకూరుస్తున్న పదుల సంఖ్యలో మందిని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తును కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:టార్గెట్ చైనా.. సరిహద్దుల్లో ఆధునిక పరికరాల మోహరింపు