మధ్యప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్(Scrub Typhus) కేసులు వెలుగు చూడటం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. వైద్య సన్నద్ధతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
రాయ్‌సేన్, నర్గింగ్పుర్, సత్నా, దమోహ్, కట్నీ జిల్లాల్లో ఈ కేసులు గుర్తించినట్లు మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యాధి చికిత్సకు(Scrub Typhus Treatment) మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలకు అన్ని విధాలా వైద్యసాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ తెలిపారు. జులై-డిసెంబర్ మధ్య అధికంగా ప్రబలే ఈ వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు(Scrub Typhus Prevention) తీసుకోవాలని సూచించారు.
స్క్రబ్ టైఫస్ అంటే?
స్క్రబ్ టైఫస్‌ను బుష్ టైఫస్ అని కూడా అంటారు. ఓరియెన్షియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈశాన్య ఆసియా, ఇండోనేషియా, చైనా, జపాన్, భారత్, ఉత్తర ఆస్ట్రేలియాల్లో ఇది ఎక్కువగా వెలుగుచూస్తుంది. స్క్రబ్ టైఫస్ సోకిన చిగ్గర్స్ (లార్వా పురుగులు) కాటు ద్వారా ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
స్క్రబ్ టైఫస్ లక్షణాలు(Scrub Typhus Symptoms) కూడా ఎన్నో ఇతర రోగాల లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. పురుగు కుట్టిన 10 రోజుల్లో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడుతుంటాయి. అవి..
- జ్వరం, చలి జ్వరం
- తల నొప్పి
- ఒళ్లు, కండరాల నొప్పులు
- పురుగు కుట్టిన చోట నల్లటిమచ్చ
- మానసిక మార్పులు (భ్రమ నుంచి కోమా వరకు)
- ఒంటిపై ఎర్రటి దద్దుర్లు
- తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి అవయవాల వైఫల్యం, రక్తస్రావం జరిగి చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.
చికిత్స ఎలా?
పై లక్షణాలు కనపడినా, ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో సంచరించినా ఆ సమాచారం వైద్యులకు వెల్లడించాలి. వైద్యులు.. రక్త పరీక్షలు చేయవచ్చు. టెస్టు రిపోర్టులు రావడానికి వారాల సమయం పడుతుంది. కాబట్టి అంతకన్నా ముందే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ చికిత్సలో డోక్సిసైక్లిన్ అనే యాంటీబయోటిక్ వాడతారు. అది అన్ని వయసుల వారికీ ఇవ్వొచ్చు. లక్షణాలు కనబడిన వెంటనే ఇది ఇస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
వ్యాధి సోకిన పెద్దలకు 200ఎంజీ డాక్సీసిలిసిన్తో పాటు 500ఎంజీ అజిత్రోమైసిన్ కనీసం ఐదు రోజులు ఇవ్వాలి
పిల్లలకయితే 4.5ఎంజీ డాక్సీసిలిసిన్, 10 ఎంజీ అజిత్రోమైసిన్ ఇవ్వాలి
గర్భిణీలకు 500ఎంజీ అజిత్రోమైసిన్ ఇవ్వాలని మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్‌లోనూ..
ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్క్రబ్ టైఫస్(Scrub Typhus in India) కేసులు వెలుగు చూశాయి.
ఇదీ చదవండి: Nipah Virus: నిఫా వైరస్ పరీక్షల్లో ఆ 30 మందికి నెగెటివ్