కరోనా వ్యాప్తి వల్ల గతేడాది మార్చిలో మూతపడిన పాఠశాలలు.. కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో శుక్రవారం(జనవరి 1) నుంచి పాక్షికంగా తెరుచుకున్నాయి. విద్యార్థుల మధ్య రెండు మీటర్ల దూరం పాటిస్తూ తరగతులు ప్రారంభమయ్యాయి. షిఫ్టులవారీగా పరిమిత గంటల్లో తరగతులను నిర్వహిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఇటీవల మార్గదర్శకాల విడుదల చేసింది కేరళ సర్కారు. పరిమిత గంటల పాటు 10, 12 తరగతులకు ఇవాళ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఒకసారికి 50శాతం మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని పాఠశాల యాజమాన్యాలకు కేరళ సర్కారు సూచించింది. విద్యార్థులు మాస్కులు ధరించేలా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే విద్యార్థులను అనుమతించాలని పేర్కొంది.
విద్యార్థులకు ఉచితంగా మాస్కులు
కర్ణాటకలోనూ 10, 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు యడియూరప్ప సర్కారు వెల్లడించింది. ఈ నేపథ్యంలో చామరాజనగర జిల్లాకు చెందిన ఓ టైలర్ 6000 మంది విద్యార్థులకు ఉచితంగా మాస్కులు పంచిపెట్టాడు. వృత్తిపరంగా దర్జీ అయిన వైయూ ఖాన్.. సామాజిక సేవలోనూ చురుగ్గా ఉంటాడు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కుట్టడానికి రూ.100 డిస్కౌంట్ ఇస్తాడు. అలాగే ప్రైవేటు స్కూల్ యూనిఫాం అయితే సాధారణ ధరే పుచ్చుకుంటాడు ఖాన్.
ఇదీ చూడండి: రికార్డు ధర పలికిన మిర్చి- క్వింటా రూ.55,329