బడ్జెట్లో వ్యాక్సినేషన్ కోసం కేటాయించిన రూ.35 వేల కోట్లను ఏ మేరకు ఖర్చు చేశారన్న వివరాలు వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నిధులను 18-44 ఏళ్ల వయసు వారికి టీకాలు కొనేందుకు ఎందుకు వినియోగించకూడదని ప్రశ్నించింది.
సరళీకృత టీకా విధానంపై కేంద్రానికి వరుస ప్రశ్నలు సంధించింది ధర్మాసనం. గుత్తాధిపత్యం(monopoly)తో అధిక మొత్తంలో కొనుగోలు చేయడం వల్లే టీకా తయారీదారుల నుంచి తక్కువ ధరకు డోసులు లభిస్తున్నట్లైతే.. సరళీకృత టీకా విధానాన్ని సుప్రీంకోర్టు సమీక్షించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఆధారంగా తాజా విధానం వెనక ఉన్న హేతుబద్ధతను పరిశీలించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. టీకా భారం రాష్ట్రాలపై వేయడం వల్ల ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. కేంద్రం ఈ స్థితి(monopoly)ని అనుకూలంగా ఉపయోగించుకొని అందరికీ ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
'ధర గురించి చెప్పండి'
ప్రైవేటు తయారీదారులతో సమన్వయంతో టీకాను అందుబాటులోకి తెచ్చి, పంపిణీ చేపడుతున్నందుకు కేంద్రాన్ని అభినందించింది. టీకా అభివృద్ధి, ఉత్పత్తి ప్రక్రియ, రాష్ట్రాలు- ప్రైవేటు ఆస్పత్రులకు ధరల నిర్ణయం వంటి విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అత్యవసర అనుమతులు మంజూరు చేయడం ద్వారా టీకా తయారీ దారుల నష్టాలను తగ్గించారా అన్న విషయంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి- ఎన్ని టీకాలు కొన్నారో చెప్పండి: సుప్రీం