నూతన సాగు చట్టాల రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్ చేస్తూ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు టీఎన్ ప్రతాపన్ దాఖలు చేసిన పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. రైతు చట్టాలపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లతో దీనిని జత చేసింది.
మూడు కొత్త చట్టాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21ను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ప్రతాపన్.. తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చట్టాలను రాజ్యాంగ విరుద్ధం, అక్రమం, వ్యర్ధమైనవిగా పరిగణించి కొట్టేయవచ్చని న్యాయస్థానానికి వివరించారు. వాతావరణంపై ఆధారపడి ఉండడం, ఉత్పత్తిలో అనిశ్చితి, మార్కెట్‌ను ఊహించలేకపోవడం, చిన్న కమతాలు వంటి కారణాల వల్ల భారత వ్యవసాయ రంగాన్ని సున్నితమైనదిగా గుర్తించినట్లు సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్‌లు, కనీస మద్దతు ధరకు ఎక్కువ నిధులు పెంచకుండా పంట ఉత్పత్తికి నిధులు పెంచడం వల్ల ఆయా సమస్యలను పరిష్కరించలేమని టీఎన్ ప్రతాపన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: కేంద్రానికి రైతు సంఘం నేత తీవ్ర హెచ్చరికలు