బంగాల్లో ఎన్నికల తర్వాత హింసపై సిట్ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు విచారించింది. బాధితులకు పునరావాసం కల్పించాలన్న పిటిషనర్ వాదనలను జస్టిస్ శరన్, జస్టిస్ గవాయ్ సభ్యులుగా గల ధర్మాసనం ఆలకించింది. దీనిపై స్పందన తెలపాలని కేంద్రం, బంగాల్ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. జాతీయ మహిళ, చిన్నారుల కమిషన్లకు కూడా నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూన్ రెండో వారానికి వాయిదా వేసింది అత్యున్నత ధర్మాసనం.
బంగాల్లో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో పలువురు టీఎంసీ, భాజపా కార్యకర్తలు మరణించారు. వేల మంది బంగాల్‌ను వీడి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నట్లు వార్తలొచ్చాయి. వీరిని వెళ్లకుండా నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.
ఇదీ చూడండి: క్షీణించిన కమ్యూనిస్టు దిగ్గజం ఆరోగ్యం