సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవెసీ పాలసీని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాట్సాప్ కొత్త పాలసీలను రద్దు చేసేలా చర్యలు చేపట్టాలన్న వినతిని తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ఈ విషయంపై దిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని పేర్కొంది.
చర్యలు చేపట్టాలి..
అఖిల భారత వ్యాపారుల సమాఖ్య ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సంస్థలకు కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషన్లో పేర్కొంది.
"ప్రజల హక్కులను పరిరక్షించడంలో కేంద్రం విఫలమైంది. తమ గోప్యతకు భంగం కలగదన్న నమ్మకంతో వినియోగదారులు ముఖ్య సమాచారాన్ని ఈ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. కానీ వాట్సాప్ ఈ ఏడాది జనవరి 4న వినియోగదారులు తమ వివరాలు సంస్థతో పంచుకోవడం తప్పనిసరి చేస్తూ కొత్త పాలసీ తెచ్చింది. ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి వచ్చే ఈ నిబంధనతో చట్టాన్ని ఉల్లఘించడమే కాక దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది."
-పిటిషన్లో అఖిల భారత వ్యాపారుల సమాఖ్య
ఇదీ చదవండి : 'రైతులు తమ హక్కుల కోసం పోరాడాలా?'