కొవిడ్-19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన 77 మంది న్యాయవాదులకు నివాళులర్పించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. సోమవారం విచారణలు ప్రారంభించే ముందు.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. సుప్రీం కోర్టు తరఫున సంతాపం తెలిపింది.
"కొవిడ్-19 మహమ్మారితో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు చెందిన 77 మంది న్యాయవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్సీబీఏ కార్యదర్శి తెలిపారు. వారికి మా సంతాపం తెలుపుతున్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నాం."
- జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి.
సోమవారం తొలి కేసు విచారణలో భాగంగా హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్.. సుప్రీంకోర్టు సంతాపం తెలపటాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. చాలా మంది కోర్టు సిబ్బంది సైతం వారి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వేసవి సెలవుల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమైంది సుప్రీం కోర్టు.
ఇదీ చూడండి: 'కష్టాలు విన్నారు.. కరుణ చూపారు'