Twin Towers Noida: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత తేదీని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 21వ తేదీన ఉన్న డెడ్‌లైన్‌ను ఆగస్టు 28 వరకు పెంచింది. ఈ నిర్దిష్ట తేదీ నుంచి సెప్టెంబర్ 4 వరకు కూల్చివేత ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. సాంకేతికత, వాతావరణ పరిస్థితుల కారణంగానే కూల్చివేత తేదీని పొడిగించినట్లు స్పష్టం చేసింది.
అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్ల భవనాన్ని నిజానికైతే మే 22వ తేదీనే కూల్చివేయాల్సి ఉండగా.. మూడు నెలల గడువు కల్పిస్తూ సుప్రీంకోర్టు గత నెల ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 28వ తేదీలోగా కూల్చివేత ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. అయితే అంతకంటే వారం ముందే.. ఆగస్టు 21వ తేదీనే భవనాలను కూల్చివేయనున్నట్లు నోయిడా అధికారులు తెలిపారు. కాగా సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో ఆ ప్రక్రియ 28న ప్రారంభం కానుంది.
కూల్చివేత ఇందుకే..
ఉత్తర్‌ప్రదేశ్ పరిధిలో నోయిడాలో సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణం విషయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాలని గతేడాది ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. అందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. అంతేగాక, వాటిని కొన్న వారందరికీ 12శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు ఈ భవనాల కూల్చివేత బాధ్యతను స్థానిక అధికారులు ఎడిఫైస్ అనే కంపెనీని అప్పగించారు. తొలుత మే 22నే వీటిని కూల్చివేయాలని నిర్ణయించి.. ఏప్రిల్‌లో టెస్టు బ్లాస్ట్ కూడా నిర్వహించారు. అయితే ఈ ప్రయోగ బ్లాస్ట్ తర్వాత ఈ నిర్మాణాలు ఊహించిన దానికన్నా దృఢంగా, స్థిరంగా ఉన్నట్టు ఎడిఫైస్ సంస్థ గుర్తించింది. దీంతో కూల్చివేతకు మరో మూడు నెలల గడువు కావాలని సంస్థ కోరింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గడువు పొడిగించింది.
ఇవీ చదవండి: పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కేంద్రం అలర్ట్.. ప్రజలు గుమిగూడొద్దంటూ..
ఫ్రీ విమాన టికెట్ అంటూ ఎర.. లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..