SC Covid ex gratia: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం కోసం వచ్చిన నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన మరణాల సంఖ్య.. పరిహారం కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు పొంతనలేని కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఐదు శాతం దరఖాస్తులపై దర్యాప్తు చేసే వెసులుబాటును కల్పించింది.
మృతుల కుటుంబీకులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే కాల వ్యవధిని 30 రోజులే ఇవ్వాలనే కేంద్రం అభ్యర్థనపై సుప్రీం స్పందించింది. పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే వ్యవధిని 60 రోజులుగా నిర్ణయించింది. భవిష్యత్లో సంభవించే కరోనా మరణాల విషయంలో ఆ వ్యవధిని 90 రోజులుగా పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50,000 పరిహారం చెల్లింపులో అవకతవకలపై సుప్రీంకోర్టు గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు అనైతికమైనవని పేర్కొంది. పరిహారం చెల్లింపు పారదర్శకంగా జరగడానికి అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించింది.
హిజాబ్ వివాదంపై..: తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విద్యార్థులకు పరీక్షలు రానున్నందున ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. పరీక్షలకు ఈ అంశంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. తరగతి గదుల్లో హిజాబ్ ధారణను నిరాకరించడం సహా అది ఇస్లాం మతాచారాల్లో భాగం కాదని ఇటీవల కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: 'వివాహం అంటే.. భార్యపై లైంగిక వేధింపులకు లైసెన్స్ పొందడం కాదు'