మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సహా వ్యాజ్యాల కేటాయింపు ఆరోపణల వెనక కుట్రకోణం ఉందా? అనే విషయంపై చేపట్టిన సుమోటో కేసును సుప్రీంకోర్టు మూసివేసింది. రెండేళ్లు దాటినప్పటికీ సరైన ఆధారాలు లభించలేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాట్సాప్ మెసేజ్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులు కానీ లభించలేదని, కాబట్టి సుమోటోను ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా.. లైంగిక వేధింపుల ఆరోపణలపై జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ప్యానెల్ ఇదివరకే దర్యాప్తు చేసి, జస్టిస్ గొగొయిని నిర్దోషిగా తేల్చిందని ధర్మాసనం గుర్తు చేసింది.
అయితే, జస్టిస్ గొగొయిపై కుట్ర జరిగిందనే విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని పేర్కొంది సుప్రీంకోర్టు. అసోం-ఎన్ఆర్సీ సహా కీలకమైన కేసుల్లో ఆయన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నందున జస్టిస్ గొగొయిపై కుట్ర జరిగి ఉండొచ్చన్న డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో లేఖను ప్రస్తావించింది ధర్మాసనం. జస్టిస్ గొగొయిపై కుట్ర జరిగి ఉండొచ్చనే విషయాన్ని నమ్మేందుకు బలమైన కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.
అయితే, సీజేఐగా జస్టిస్ గొగొయి తీసుకున్న నిర్ణయాలే కుట్రకు కారణమైందనే ఆరోపణలపై విచారణ నిర్వహించలేమని.. 2019 ఏప్రిల్ 25న జస్టిస్ పట్నాయక్ నివేదిక ఇచ్చిందని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి:అసమ్మతి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం